జనంపైకి దూసుకెళ్లిన వ్యాన్
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:31 AM
జాతీయ రహదారిపై అక్కయ్యవలస జంక్షన్ సమీపంలో శనివారం సాయంత్రం ఒక బొలెరో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురు గాయపడడానికి కారణమయ్యాడు.
ఆరుగురికి గాయాలు
కోటబొమ్మాళి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అక్కయ్యవలస జంక్షన్ సమీపంలో శనివారం సాయంత్రం ఒక బొలెరో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురు గాయపడడానికి కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నరసన్నపేట నుంచి టెక్కలి వైపు వెళుతున్న బొలెరో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడు. అక్కయ్యవలస జంక్షన్ సమీపంలోకి వచ్చే సరికి వాహనం అదుపుతప్పి జనం పైకి దూసుకుపోయింది. ముందుగా కోటబొమ్మాళికి చెందిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పంట కాలువలో బోల్తా పడింది. అందులో ఉన్న ఆటో డ్రైవర్ దేవాది అప్పన్నతో పాటు ప్రయాణికులు కిర్రు దానమ్మ, తోట భాను, కొల్లి రాజులు గాయపడ్డారు. అదే సమయంలో గట్లపాడు నుంచి కోటబొమ్మాళికి ద్విచక్ర వాహనంపై వస్తున్న పైల చిన్నారావు, నరసన్నపేట నుంచి కొత్తపేట ద్విచక్ర వాహనంపై వస్తున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన పైడిశెట్టి భీమశంకరుడులను ఢీకొంది. వీరు తీవ్రంగా గాయడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ అసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సంతోష్‌ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.