Share News

కొండపైకి వంశధార నీరు

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:18 AM

కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు త్వరలో వంశధార జలాలు చేరనున్నాయి. మరో రెండు నెలలో ఉద్దానం పేజ్‌-2 పనులు పూర్తికానున్నాయి.

 కొండపైకి వంశధార నీరు
అడ్డివాడలో జక్కర నీటిని వినియోగిస్తున్న గిరిజనులు

- పూర్తికానున్ను ఉద్దానం పేజ్‌-2 పనులు

- 50 గిరిజన గ్రామాలకు తీరనున్న తాగునీటి కష్టాలు

మెళియాపుట్టి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు త్వరలో వంశధార జలాలు చేరనున్నాయి. మరో రెండు నెలలో ఉద్దానం పేజ్‌-2 పనులు పూర్తికానున్నాయి. దీంతో గిరి శిఖర గ్రామాలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. మెళియాపుట్టి మండలంలో అడ్డివాడ, కేరాశింగి, గూడ, చందనగిరితోపాటు 50 గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో అనేక గ్రామాలు కొండలపైనే ఉన్నాయి. సరైన తాగునీటి సదుపాయం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ జక్కర నీటిపైనే ఆధారపడి గొంతు తడుపుకొంటున్నారు. గత వైసీసీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికీ తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేసింది. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఉద్దానం పేజ్‌-2 ప్రాజెక్టు కింద గత ఏడాది కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పనులు ప్రారంభించారు. దీంతో రూ.265 కోట్లతో 578 గ్రామాలకు హిరమండలం వంశధార నీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. మెళియాపుట్టి మండ లంలోని 50 గిరిజన గ్రామాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఆగస్టు నాటికి తాగునీరు సరఫరా చేయాలని భావించారు. కానీ, కొంతమేర పనులు పెండింగ్‌లో ఉండడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం కొండలపై ప్రత్యేక పైపులైన్లు వేస్తున్నారు. వరదలకు పైపులు కొట్టుకుపోకుండా సిమెంట్‌ దిమ్మెలు కడుతున్నారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తయి గిరి శిఖర గ్రామాలకు వంశధార నీరు చేరనుంది.

Updated Date - Oct 15 , 2026 | 12:18 AM