Share News

రూ.142 కోట్లు ఇస్తే.. వంశధారకు మహర్దశ

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:01 AM

Completion of the second phase will provide water to an additional 20,000 acres వంశధార ప్రాజెక్టుకు నిధులే కీలకంగా మారాయి. ప్రభుత్వం రూ.142.67 కోట్లు విడుదల చేస్తే రెండో దశ పనులు పూర్తవుతాయి. తద్వారా అదనంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే ఈ పనులపై సుమారు రూ.2180 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు ఏళ్లుగా అంతర్రాష్ట్ర వివాదంతో నిలిచిపోయిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి కూడా అడుగులు పడుతున్నాయి.

రూ.142 కోట్లు ఇస్తే.. వంశధారకు మహర్దశ
గొట్యాబ్యారేజీ వద్ద వంశధార నది.. నేరడి బ్యారేజీ నిర్మించనున్న ప్రాంతం

  • రెండోదశ పూర్తి చేస్తే అదనంగా 20వేల ఎకరాలకు నీరు

  • నేరడి బ్యారేజీకి తొలగుతున్న అడ్డంకులు

  • రేపటి నుంచి పర్యవేక్షక కమిటీ పర్యటన

  • ఒడిశాలోని భూసేకరణపైనే ప్రధాన దృష్టి

  • శ్రీకాకుళం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టుకు నిధులే కీలకంగా మారాయి. ప్రభుత్వం రూ.142.67 కోట్లు విడుదల చేస్తే రెండో దశ పనులు పూర్తవుతాయి. తద్వారా అదనంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే ఈ పనులపై సుమారు రూ.2180 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు ఏళ్లుగా అంతర్రాష్ట్ర వివాదంతో నిలిచిపోయిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి కూడా అడుగులు పడుతున్నాయి. ట్రిబ్యునల్‌ తీర్పు అమలు కోసం కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుంది. ఒడిశా పరిధిలోని 106 ఎకరాల భూసేకరణపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది.

  • నేరడికి తొలగుతున్న అడ్డంకులు

  • వంశధార నదీ జలాల వివాదంపై 2023 జూన్‌లో ట్రిబ్యునల్‌ తుది తీర్పు వెలువరించంది. 2024లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దాన్ని గెజిట్‌లో నోటిఫై చేసింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ట్రిబ్యునల్‌ తీర్పు అమలు కోసం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యుసీ) చీఫ్‌ ఇంజనీర్‌ నాగమోహన్‌ చైర్మన్‌గా పర్యవేక్షక కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర జలసంఘం ఎస్‌ఈ ఆదిత్యశర్మ, ఏపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌, ఒడిశా నుంచి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఉన్నతాధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తొలిసారిగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడ భూ సర్వేకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ఇక్కడ బ్యారేజీ నిర్మించాలంటే ఒడిశా పరిధిలో ఉన్న 106 ఎకరాల భూమి అత్యంత కీలకం. ఆ భూమిని సేకరించి ఇవ్వాల్సిందిగా ఒడిశా ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ఏపీ ప్రభుత్వమే ఒడిశాకు చెల్లించనుంది. శ్రీకాకుళంలో జరగనున్న కమిటీ సమావేశంలో ఈ భూసేకరణపై రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయనున్నారు. మరోవైపు తాజా పరిస్థితులకు అనుగుణంగా కొత్త డీపీఆర్‌ రూపకల్పనకు టెండర్లు పిలుస్తున్నారు. కొత్త డీపీఆర్‌ సిద్ధమైతే నేరడి బ్యారేజీ నిర్మాణానికి పూర్తిస్థాయి అంచనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తొలిదశలో 1,48,000 ఎకరాలు, రెండో దశలో 1,07,280 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనికితోడు వంశధార-నాగావళి అనుసంధాన ఫలాలు దక్కడంతో పాటు, జిల్లాలో కొత్తగా 75వేల ఎకరాలకు నీరందించవచ్చు. శాశ్వతంగా తాగునీటి సమస్య కూడా తీరుతుంది.

  • ఆ నిధులిస్తే.. కష్టాలు తీరినట్లే

  • వంశధార ప్రాజెక్టు రెండో దశ- రెండో భాగం పనులు పూర్తి చేసేందుకు కావాల్సింది కేవలం రూ. 142.67 కోట్లు. మరోవైపు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినా.. పనులు ప్రారంభించాలంటే రూ.12.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు రెండో దశ-రెండో భాగంలో ఇప్పటివరకు సుమారు. 2,180 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులతో 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.5లక్షల జనాభాకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఇప్పుడు కేవలం రూ.143 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు అంతే స్థాయిలో అదనంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. కాగా.. ప్రణాళిక, ఆర్థిక, జలవనరుల శాఖల మధ్య సమన్వయ లోపం అడ్డంకిగా మారింది.

  • జలాశయం నిండినా.. నిల్వకు అడ్డంకులు

  • నేరడి బ్యారేజీ నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రతిపాదిత స్థలం వ్దద సైడ్‌వీయర్‌ నిర్మించి అక్కడి నుంచి 33.70 కిలోమీటర్ల వరద కాలువ ద్వారా హిరమండలం జలాశయంలో 19.05 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రణాళిక రచించారు. హిరమండలం జలాశయం నిర్మాణం దాదాపు పూర్తయినా.. స్పిల్‌వే గేట్లు, ఒక సబ్సిడరీ కట్ట నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో జలాశయంలో 6 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. తాజా పరిణామాలతో స్పిల్‌వే గేట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది. అనుబంధ కట్ట డాల నిర్మాణం పూర్తయితేనే 19.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకు వీలవుతుంది. ఇంకా దాదాపు 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 8 వేల క్యూబిక్‌మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీ 87, 99 కింద డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంలో 86 కట్టడాల నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఈ పనులు పూర్తి చేసి ఉంటే ఎల్‌-నినో ప్రభావం ఉన్న ఈ ఏడాదిలో కూడా హిరమండలంలో 19.5 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:01 AM