Share News

శివారుకు వంశ‘ధార’

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:07 AM

Modernization of the Left Canal శివారు భూములకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికి అనుసంధానంగా ఉన్న దేశబట్టి కాలువను కూడా అభివృద్ధి చేస్తున్నారు.

శివారుకు వంశ‘ధార’
దేశబట్టి కాలువలో తొలగిస్తున్న మట్టి

  • చురుగ్గా ఎడమ కాలువ ఆధునికీకరణ

  • అనుసంధానంగా ఉన్న దేశబట్టికి కూడా మరమ్మతులు

  • రూ.60 లక్షలతో చేపడుతున్న పనులు

  • ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

  • పలాస, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): శివారు భూములకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికి అనుసంధానంగా ఉన్న దేశబట్టి కాలువను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వంశధార కాలువలో లైనింగ్‌, పూడికతీత వంటి పనులు చేపడుతుండంతో ఈ ఏడాది వేలాది ఎకరాల శివారు ఆయకట్టుకు నీరు అందనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార కాలువ పలాస నియోజకవర్గంలోకి అడుగు పెడుతుంది. మొత్తం 16 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కాలువ వజ్రపుకొత్తూరు మండలం శివారు భూముల వరకూ వెళ్తుంది. ఈ కాలువను గత ప్రభుత్వాలేవీ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు, పూడికలతో నిండిపోయింది. గొట్టా బ్యారేజీ నుంచి పూర్తిసామర్థ్యంతో కాలువలోకి నీరు విడుదల చేసినా శివారు భూములకు చేరేదికాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే గౌతు శిరీష వంశధార కాలువపై పూర్తి దృష్టి సారించారు. కాలువ మరమ్మతులు, లైనింగ్‌ పనులు, పూడికలు తీయడానికి కలెక్టర్‌ను ఒప్పించారు. వంశధార అధికారులతో చర్చించిన తరువాత రూ.60 లక్షలు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. లైనింగ్‌ పనులు పూర్తయితే చుక్కనీరు కూడా వృథా కాకుండా శివారు భూములకు చేరుతుంది.

  • దేశబట్టి కాలువ..

  • లొత్తూరు వరహాలు గెడ్డ, లొద్దభద్ర హరిసాగరం, మెళియాపుట్టి మండలంలో ఉన్న గంగసాగరం వంటి భారీ చెరువుల నుంచి వచ్చే నీరంతా దేశబట్టి కాలువ గుండా ప్రవహిస్తుంది. పలాస మీదుగా వజ్రపుకొత్తూరు శివారు వరకూ వంశధార కాలువతో కలసి ప్రవహిస్తుంది. దేశబట్టి కాలువ పరిధిలో 4 వేలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. గత పాలకులు ఈ కాలువను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పలాస మండలం మరదరాజపురం వద్ద కాలువలో వేలాది టన్నుల ఇసుక, మట్టి, కంకర పేరుకుపోయింది. దీనివల్ల వరద నీరంతా పొలాల్లోకి వెళ్లిపోయేది. ఈ సమస్యను వంశధార డిస్ట్రిబ్యూటరీ సభ్యులు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ రైతులే ఈ పనులు చేయాలని, నిధులకు బదులు ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్ల నిర్వహణకు డీజిల్‌ ఖర్చులు ఇస్తామని చెప్పారు. రైతులకు ఎంతో మేలు చేకూరే దేశబట్టిని ఏ విధంగానైనా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కాలువలో పేరుకుపోయిన ఇసుక, మట్టి, కంకరను ప్రస్తుతం తొలగిస్తున్నారు. చిన్న వర్షం పడినా ఆ నీరు నేరుగా కాలువలో ప్రవహించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది వంశధార, దేశబట్టి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగు నీరు శివారు భూములకు ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆదేశాలతోనే..

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు వంశఽ దార, దేశబట్టి కాలువలను ఆధునీకరిస్తున్నాం. వంశధారకు నిధులు ఇచ్చినా దేశబట్టిని మాత్రం కేవలం రైతుల శ్రేయస్సు, నియోజకవర్గ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తున్నాం. వేలాది టన్నుల మట్టి, ఇసుక కాలువలో పేరుకుపోయింది. ఏళ్లతరబడి మరమ్మతులు చేయలేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది నుంచి అటువంటి పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

    - గున్న నిరంజన్‌, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు

Updated Date - Jun 15 , 2026 | 12:07 AM