Share News

సాగుకు వంశ‘ధార’

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:13 AM

Water released through the Left Main Canal today ఎట్టకేలకు ఖరీఫ్‌ సీజన్‌లో వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా సాగునీటి విడిచిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. ‘‘వంశ‘ధార’ వచ్చేనా’’ అనే శీర్షికతో ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు.

సాగుకు వంశ‘ధార’
గొట్టా బ్యారేజి వద్ద నీటి నిల్వ

  • నేడు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల

  • శ్రీకాకుళం/ హిరమండలం/ టెక్కలి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఖరీఫ్‌ సీజన్‌లో వంశధార ప్రధాన ఎడమకాలువ ద్వారా సాగునీటి విడిచిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. ‘‘వంశ‘ధార’ వచ్చేనా’’ అనే శీర్షికతో ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్కర్‌ పుండ్కర్‌, వంశధార ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ అరవల రవీంద్ర, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. వంశధార ప్రధాన ఎడమకాలువ వెంబడి సాగునీరు విడిచిపెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం పది గంటలకు ఎడమ ప్రధాన కాలువ సాగునీటిని విడిచిపెట్టనున్నట్లు ఈఈ మురళీమోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామన్నారు. ‘జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ 104కి.మీల మేర విస్తరించి ఉంది. దీని ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాల్లోని 398 గ్రామాల్లో 1,48,200 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు పడుతుండటంతో నదిలో నీరు చేరుతోంది. గత వారం రోజులుగా గొట్టాబ్యారేజీ ఎగువ ప్రాంతంలో నీటి నిల్వ చేస్తున్నాం. ఆదివారం సాయంత్రానికి 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 37.1 మీటర్లు మేర నీటిమట్టం ఉంది. ఈ నీటిని సోమవారం విడుదల చేయనున్నామ’ని ఈఈ తెలిపారు.

  • రైతులకు అండగా..

  • ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశధార కాలువ ద్వారా సుదూరంలో ఉన్న పలాస ప్రాంత శివారు భూములకు సైతం సాగునీరు అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది కూడా అదే లక్ష్యంతో ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేరుస్తామని, రైతన్నలకు ఇబ్బందులు రాకుండా అండగా నిలుస్తామ’ని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - Jul 06 , 2026 | 12:13 AM