Share News

జిల్లా అంతటా వంశ‘ధార’

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:14 AM

New project under Jaljeevan Mission హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌ నుంచి జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా జిల్లాలోని మరో ఐదు నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.1,204 కోట్లు మంజూరుచేసి, టెండర్లు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ గాయత్రిదేవి సోమవారం హిరమండలం వద్ద పరిస్థితిని పరిశీలించారు.

జిల్లా అంతటా వంశ‘ధార’
ఆర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులకు సూచనలిస్తున్న ఈఎన్‌సీ గాయత్రి

రూ.1,204 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ కింద కొత్త ప్రాజెక్టు

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ గాయత్రిదేవి

హిరమండలం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌ నుంచి జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా జిల్లాలోని మరో ఐదు నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.1,204 కోట్లు మంజూరుచేసి, టెండర్లు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ గాయత్రిదేవి సోమవారం హిరమండలం వద్ద పరిస్థితిని పరిశీలించారు. పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్‌ 20నాటికి సర్వే పూర్తి చేసి డ్రాయింగ్‌ అందజేయాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ రైల్వేక్రాస్‌ లైన్లు, నేషనల్‌ హైవే, ఫారెస్ట్‌ ఏరియాలను గుర్తించి నివేదిక తయారు చేయాలన్నారు. ఇంటెక్‌వెల్‌ పనులు కూడా డిసెంబరు 20నాటికి ప్రారంభించి యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘హిరమండలం రిజర్వాయర్‌పై ఉద్దానం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశాం. దీని ద్వారా మూడు నియోజకవర్గాల్లోని 807 గ్రామాలకు తాగునీరు అందిస్తాం. ఉద్దానం ఫేజ్‌-2 కింద 559 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాం. కొత్తగా జలజీవన్‌ మిషన్‌ కింద ఐదు నియోజక వర్గాలకు తాగునీరు అందించేందుకు పనులు ప్రారంభించనున్నాం. ఈ పథకం ద్వారా 889 గ్రామాలకు తాగునీరు అందిస్తాం. ఇందుకోసం వంశధార రిజర్వాయర్‌లో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉండాలి. దీనికి రిజర్వాయర్‌ వద్ద కావల్సిన ప్రాంతాన్ని గుర్తిస్తున్నాం. దీనికి మైన్స్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్యూఎస్‌ శాఖల అధికారులతో సోర్స్‌ఫైండింగ్‌ కమిటీ ఏర్పాటు చేశాం. కొన్ని చోట్ల బ్లాస్టింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇటీవల అగ్రిమెంట్‌లు కూడా పూర్తయ్యాయి. డిసెంబరు 20వతేదీ లోపు సర్వే పూర్తిచేస్తాం. కట్టడాలు, పైప్‌లైన్లు నిర్మాణాలు ఒక్కోక్కటిగా ప్రారంభించి 2028 జూన్‌ నాటికి దాదాపుగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శంకర్‌బాబు, డీఈఈ సంపదిరావు రామకృష్ణ, ఏఈఈలు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:14 AM