హాస్టల్‌ను ఖాళీ చెయ్!
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:09 AM
: బాధిత విద్యార్థినికి అండగా నిలబడాల్సిన హాస్టల్ సిబ్బంది ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇంటి నుంచే రోజూ కళాశాలకు రావాలి
బాధిత విద్యార్థినితో వసతిగృహ సిబ్బంది
బీఆర్‌ఏయూ వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు
గతంలో విద్యార్థినితో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యకర సంభాషణ
అప్పట్లో ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్
ఈ కారణంగానే అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు
ఎచ్చెర్లరూరల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బాధిత విద్యార్థినికి అండగా నిలబడాల్సిన హాస్టల్ సిబ్బంది ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోమంటున్నారు. ఇంటి నుంచి కళాశాలకు రమ్మని చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అధికారుల ఆదేశాలని అంటున్నారు. పైగా ఉన్నతాధికారులను కలవనివ్వకుండా, తోటి విద్యార్థినులతో మాట్లాడనివ్వకుండా ఆంక్షలు పెడుతున్నారు. దీంతో ఆ విద్యార్థిని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఏం జరిగిందంటే..
అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ విద్యార్థినితో ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై విచారణకు వర్సిటీ ఉన్నతాధికారులు మే 7న త్రిసభ్య కమిటీ వేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. కమిటీ విచారణ నిర్వహించి 90 రోజుల్లో నివేదిక అందజేయాల్సి ఉంది. ఈ కమిటీ ముందుకు హాజరు కావాలని విద్యార్థినికి అధికారులు ఆదేశాలు జారీ చేసినా ఆమె రాలేదు. విచారణకు రాకపోవడంతో పాటు ఆడియోను బయట పెట్టిందన్న కోపంతో అధికారులు ఆమెపై అక్కసు పెంచుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ మహిళా వసతి గృహ సిబ్బంది గురువారం ఆ విద్యార్థినికి తన గదిని ఖాళీ చేయమన్నారు. డేస్ స్కాలర్‌గా కాలేజీకి రమ్మన్నారు. కారణం చెప్పమని విద్యార్థినితో పాటు తోటి విద్యార్థులు సిబ్బందిని ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాలు అంటూ బదులిచ్చారు.
టెక్కలి నుంచి ఎలా వచ్చేది?
బాధిత విద్యార్థినిది టెక్కలి నియోజకవర్గంలోని ఓ గ్రామం. అక్కడి ప్రతిరోజూ ఎచ్చెర్లలోని కళాశాలకు రాకపోకలు సాగించడం సాధ్యం కాదు. ఒకపక్క 40 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. స్థానికంగా గదిని అద్దెకు తీసుకొని ఉండాలంటే ఆర్థిక భారం. ఈ నెల ఒకటో తేదీ నుంచి విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రాంభమయ్యాయి. అయితే, 15 రోజుల తరువాత ఆమెను వసతి గృహాన్ని ఖాళీ చేయమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22 నుంచి మిడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థిని పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుంది. విద్యార్థిని వర్సిటీ ఉన్నతాధికారులను కలిసే ప్రయత్నం చేసినా కలవనివ్వడం లేదు. తోటి విద్యార్థులతో సైతం మాట్లాడవద్దని ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విద్యార్థిని మూడో సెమిస్టర్‌లో కొనసాగుతుంది. మూడేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది.
నిబంధనలు ఇలా..
నిబంధనల మేరకు బాధిత విద్యార్థినిని వేధించకూడదు. యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్-2015, పోస చట్టం-2013 మేరకు బాధిత విద్యార్థినికి రక్షణగా నిలవాలి. విద్యార్థినిని టార్గెట్ చేస్తే అధికారులు సైతం విచారణ ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. విద్యార్థిని భవిష్యత్తు వర్సిటీ ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది. ప్రయోగాలు, పరీక్షలు రాయవల్సి ఉంటుంది. అటువంటి విద్యార్థిని అధికారులపై పోరాటం చేయటం సాధ్యపడే అంశం కాదు. దీంతో భయపడిపోతుంది. దీనిపై చీఫ్ వార్డెన్ చిన్న సుబ్బారావును వివరణ కోరగా.. ‘విద్యార్థినికి వేధింపులపై కమిటీ విచారణ సాగుతుంది. ఈ సమయంలో నిబంధనల మేరకు విద్యార్థిని హాస్టల్‌లో ఉండకూడదు. అధికారుల ఆదేశాల మేరకు వసతి గృహాన్ని ఖాళీ చేయాలని సూచించాం’ అని అన్నారు. ఈ అంశంపై విశ్వ విద్యాలయం రిజస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యను ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు.