మూలపేటలో యూరియా ప్లాంట్
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:23 AM
GAIL signs MoU with Economic Development Board సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిధిలో 700 ఎకరాల్లో రూ.13,500 కోట్లతో గెయిల్, క్రిబ్కో సంస్థలు యూరియా ప్లాంట్ పరిశ్రమ నెలకొల్పనున్నాయి. ఇందుకు సంబంధించి విశాఖలోని సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకుంది.
సీఐఐ సమ్మిట్‌లో ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డుతో గెయిల్ ఎంవోయూ
టెక్కలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిధిలో 700 ఎకరాల్లో రూ.13,500 కోట్లతో గెయిల్, క్రిబ్కో సంస్థలు యూరియా ప్లాంట్ పరిశ్రమ నెలకొల్పనున్నాయి. ఇందుకు సంబంధించి విశాఖలోని సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకుంది. మూలపేట పోర్టుకు వేళ్లే రైల్వేట్రాక్ మార్గంలో డీజీపురానికి దగ్గరగా 500 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణానికి, పరిశ్రమకు సంబంధించి రెసిడెన్షియల్ అవసరాలకు 200 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు, అవసరమైన నీరు, విద్యుత్, రోడ్డు, రైలు కనెక్టివిటీలు తదితర సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గెయిల్ సంస్థకు తెలియజేసింది. ఇటీవల గెయిల్ సంస్థ ప్రతినిధుల బృందం ఈ ప్రాంతాన్ని పర్యటించి.. అన్ని వివరాలు సేకరించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గెయిల్ సంస్థకు నామమాత్రపు రేట్లకు భూమి అప్పగించనుంది.
పరిశ్రమ నిర్మాణం పూర్తయితే ఏటా 1.27 మిలియన్ మెట్రిక్‌టన్నుల వార్షిక సామర్ధ్యంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి తయారుచేస్తారు. ఇందుకు సంబంధించి కేంద్రం ఇటీవల నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా -2026కు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పరిసర ప్రాంతం పారిశ్రామిక వేదికగా నిలవనుంది. ఈ యూరియా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయమై ఆర్డీవో కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా.. మూలపేట పోర్టు పరిసరాల్లో యూరియా ప్లాంట్‌కు అవసరమైన 700 ఎకరాలు సిద్ధం చేశామని, పరిశ్రమ నెలకొల్పేందుకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.