Share News

యూరియా దొరకట్లే!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:02 AM

Inadequate urea supply జిల్లాలో ఎరువులు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఎరువుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు సరఫరా చేయడంతో రైతులకు మరింత కష్టాలు ఎదురవుతున్నాయి.

యూరియా దొరకట్లే!

  • ఆర్‌ఎస్‌కేలు, సహకార సంఘాల ద్వారా అరకొరగా సరఫరా

  • యాప్‌ విధానంతో తప్పని పాట్లు

  • ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

  • కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామంటున్న వైనం

  • అధిక ధరలకు విక్రయం

  • టెక్కలి మండలం నర్శింగపల్లి రైతుసేవాకేంద్రం పరిధిలో సుమారు 1,200 ఎకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించి 980 మంది రైతులకుగాను 20 టన్నుల యూరియా, 12 టన్నుల డీఏపీని సగం మందికి మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన వారికి కూపన్లు ఇచ్చి 20 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఎరువులు అందించలేదు. 50 సెంట్ల లోపు భూమి ఉన్న రైతులకు యూరియా, డీఏపీ వంటివి సరఫరా చేయలేదు. వాటికోసం కాళ్లరిగేలా రైతుసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎరువులు అందకపోతే వ్యవసాయం సాగేది ఎలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • టెక్కలి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువులు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఎరువుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు సరఫరా చేయడంతో రైతులకు మరింత కష్టాలు ఎదురవుతున్నాయి. మొదటివిడత పీఏసీఎస్‌ల ద్వారా సరఫరా చేయగా, రెండోవిడత రైతుసేవా కేంద్రాలు ద్వారా ఎరువులు అందిస్తున్నారు. అయితే, ఆయా శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా కొన్ని రైతు సేవాకేంద్రాల్లో రైతులకు ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పైగా కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామని షరతు పెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 4.02 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఈ ఏడాది 8,770 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,769 మెట్రిక్‌టన్నుల డీఏపీ వంటి ఎరువులతో పాటు బఫర్‌స్టాక్‌ ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలాచోట్ల రైతులకు ఎరువులను పంపిణీ చేయలేదు. టెక్కలి మండలం పరిధిలో ఈ ఏడాది 17,260 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వీరికి మొదటివిడత రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా 380 టన్నులు యూరియా, డీలర్ల ద్వారా మరో 320 టన్నుల యూరియా అందించారు. ఇంకా 550 టన్నులు ఈ మండలానికి అవసరముంది. ఇదే పరిస్థితి అన్ని మండలాల్లో ఉంది. ప్రతి రైతు సేవా కేంద్రానికి చెరో 20 టన్నుల యూరియా, డీఏపీ కావాలని ఇండెంట్లు పెట్టామని, రెండు, మూడురోజుల్లో యూరియా సరఫరా చేస్తామంటూ వ్యవసాయశాఖ అధికారులు చెప్పే మాటలు విని రైతులు విసిగి వేసారిపోయారు. కొన్నిచోట్ల ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొందరు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు మొక్కుబడిగా దాడులు చేసి సంబంధిత దుకాణదారుల లైసెన్స్‌ను వారం రోజులపాటు సస్పెండ్‌ చేస్తున్నారు. ఆ తరువాత షరామామూలే అన్నట్లు పరిస్థితి మారుతోంది.

  • ప్రైవేట్‌ డీలర్ల వద్ద కొనుగోలు చేద్దామంటే అధిక భారం తప్పడం లేదు. యూరియా, డీఏపీ కావాలని వెళ్తే దుబ్బు గులికలు, నానోయూరియా, జింక్‌, ఇతరత్రా మందులు అంటగడుతున్నారు. దీనికితోడు రూ.272 యూరియా బస్తా రూ.320కు, రూ.1,370 డీఏపీ బస్తా రూ.1,450కు అమ్మకాలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు.

  • ఇండెంట్‌ పెట్టాం..

  • ఇప్పటికే 550టన్నుల యూరియా, 220 టన్నుల డీఏపీ ఇండెంట్‌ పెట్టాం. రెండు, మూడు రోజులో అవి వస్తే సరఫరా చేస్తాం. లేదంటే బఫర్‌స్టాక్‌ నిల్వలైనా తీసుకొని రైతులకు ఎరువులు అందిస్తాం.

    -ఎన్‌.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ ఏడీ

Updated Date - Aug 17 , 2026 | 12:02 AM