Share News

నగర ఓటరు.. ప్చ్‌!

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:00 AM

54.7 percent polling in Srikakulam Corporation పదహారేళ్ల తర్వాత శ్రీకాకుళం నగరపాలక సంస్థకు, ఎనిమిదేళ్ల తర్వాత ఆమదాలవలస మున్సిపాలిటీకి గురువారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రం.. శ్రీకాకుళం నగరంలో మాత్రం ఓటర్లు ఓటింగ్‌కు పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 54.7 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆమదాలవలస మున్సిపాలిటీలో మాత్రం 75 శాతానికిపైగా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

నగర ఓటరు.. ప్చ్‌!
శ్రీకాకుళం : బాదుర్లపేట పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుదీరిన ఓటర్లు

ఓటింగ్‌కు పెద్దగా ఇష్టపడని వైనం

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 54.7 శాతం పోలింగ్‌

ఆమదాలవలస మునిసిపాలిటీలో 75.20 శాతం పోలింగ్‌

మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్‌అరెస్ట్‌

పోలీసుల ముందస్తు వ్యూహంతో వివాదాలకు చెక్‌

కౌంటింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సుల తరలింపు

శ్రీకాకుళం/ఆమదాలవలస, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): BJR_0001A.gifBJR_0012.gif26-sarubujjili-9.gifకలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ పకడ్బందీగా వ్యవహరించి.. వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. సాయంత్రం పోలింగ్‌ ప్రక్రియ పూర్తవగానే శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను తరలించారు. అక్కడ భద్రపరిచారు. ఇక ఫలితాల కోసం ఈ నెల 30 వరకూ వేచిచూడాలి.

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో మందకొడిగా..

శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్‌, 60 కార్పొరేటర్‌ స్థానాలకు ఓటింగ్‌ ప్రక్రియ గురువారం ఏడు గంటలకు ఆరంభమైనా... చివరివరకూ మందకొడిగానే కొనసాగింది. మొత్తం 180 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు 11.8 శాతం పోలింగ్‌ జరిగింది. 11 గంటలకు 18.9శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు 39.81 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 47.1 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక సాయంత్రం ఐదు గంటలకు కేవలం 49.1 శాతం నమోదైంది. 5 గంటలలోగా పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ఓటర్లు.. ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలో తుది పోలింగ్‌ శాతం 54.7గా నమోదైంది. జనసేన మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణి, వైసీపీ మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మహిళా ఓటర్లే కీలకం...

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 1,57,545 ఓటర్లు ఉన్నారు. 86,129 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు 79,985 మంది, పురుషులు 77,535 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో మొత్తం 44,281 మంది మహిళలు (55.4 శాతం), 41,848 మంది పురుషులు (54 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాల తీర్పులో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు.

మాజీమంత్రి ధర్మాన హౌస్‌అరెస్ట్‌..

వైసీపీ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి స్వయంగా తానే జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తామని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఓ మాజీమంత్రి జనరల్‌ ఏజెంట్‌గా వెళ్లడం.. ఈ విషయంలో వివాదాలు జరిగే అవకాశముందన్న సంకేతాలు అందడంతో గురువారం ఉదయం నుంచే పోలీసులు ధర్మాన ఇంటి వద్ద మోహరించారు. ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేసి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. తనను ఉద్దేశపూర్వకంగా బయటకు రానీయకుండా అడ్డుకున్నారని... ఎల్లకాలం ఒకే ప్రభుత్వం కొనసాగదని.. ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారపార్టీ నాయకులను, అధికారులను.. తమ ప్రభుత్వం ఏర్పడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ధర్మాన పేర్కొన్నారు.

ముందస్తు వ్యూహంతో రౌడీషీటర్లు అదుపులోకి...

నగరంలో 16ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటం.. రౌడీషీటర్ల వల్లనే ఎక్కువ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని పోలీసులు ముందుగానే గుర్తించారు. గురువారం వేకువజామునే నగరంలో ఉన్న రౌడీషీటర్లందరినీ ప్రత్యేక వాహనంలో తరలించి... శ్రీకాకుళం నగరపాలక సంస్థక దూరంగా ఉండే స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోయింది. వైసీపీ నాయకులు అక్కడక్కడా చిన్నపాటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

ఆమదాలవలసలో పోటెత్తిన ఓటర్లు

ఆమదాలవలస మునిసిపాలిటీలో ఓటర్లు తొలినుంచి చివరి వరకు పోటెత్తారు. మునిసిపాలిటీలో 28 వార్డుల్లో 33,067 మంది ఓటర్లు ఉండగా 24867 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1191 మంది, మహిళలు 12951 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు బారులుదీరడంతో.. సకాలంలో సాయంత్రం 5 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు 16.9 శాతం, 11 గంటలకు 34 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 54.6 శాతం, మధ్యాహ్నం మూడు గంటలకు 68.1 శాతం, సాయంత్రం 5 గంటలకు 75.20 శాతం పోలింగ్‌ నమోదయింది. వార్డుల్లో కూడా ఎన్నిక అంతటా ప్రశాంతంగా ముగిసింది. ముసిసిపాలిటీలోని నందగిరిపేట, చింతాడ, బొడ్డేపల్లిపల్లి, పాత ఆమదాలవలస, కృష్ణాపురం ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.

ఆమదాలవలస పట్టణంలోని మెట్టక్కివలస 11, 14 వార్డుల పోలింగ్‌ కేంద్రాల వద్ద చిన్నపాటి వివాదం చెలరేగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ కూడా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని స్థానికులు ఆందోళన చెందారు. కానీ అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందస్తుగానే పోలీసు బలగాలు మోహరించడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.

18వ వార్డు పాతినివారిపేట, 8వార్డు నందగిరిపేట, 7, 9 వార్డులు చింతాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా చిన్నపాటి వివాదాలు తలెత్తగా పోలీస్‌ బలగాలు పరిస్థితిని చక్కదిద్దాయి.

Updated Date - Nov 27 , 2026 | 01:00 AM