Share News

మహిళలకే ‘పట్టణ’యోగం!

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:09 AM

Srikakulam Mayor post reserved for women స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్‌, మునిసిపాలిటీలకు రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించడంతో జిల్లా రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన స్థానాలన్నీ మహిళలకే దక్కడంతో ఆర్థిక, రాజకీయ బలం ఉన్న మహిళల కోసం ఆయా పార్టీల అధిష్ఠానాలు, స్థానిక ఎమ్మెల్యేలు అన్వేషణ ప్రారంభించారు.

మహిళలకే ‘పట్టణ’యోగం!

శ్రీకాకుళం మేయర్‌ పీఠం మహిళ(జనరల్‌)కే

పలాస, ఆమదాలవలస మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు కూడా...

‘ఇచ్ఛాపురం’.. బీసీ మహిళకు ఖరారు

మునిసిపల్‌ రిజర్వేషన్ల ప్రకటన

అభ్యర్థుల వేటలో ప్రధాన రాజకీయపార్టీలు

శ్రీకాకుళం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్‌, మునిసిపాలిటీలకు రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించడంతో జిల్లా రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన స్థానాలన్నీ మహిళలకే దక్కడంతో ఆర్థిక, రాజకీయ బలం ఉన్న మహిళల కోసం ఆయా పార్టీల అధిష్ఠానాలు, స్థానిక ఎమ్మెల్యేలు అన్వేషణ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థల మేయర్‌ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం మేయర్‌ స్థానం ఈసారి మహిళా (జనరల్‌)కు దక్కింది. దీంతో అన్నివర్గాల మహిళలు పోటీ పడేందుకు అవకాశం కలిగింది. ఆశావహులైన నాయకులు తమ ఇంటి మహిళలను బరిలోకి దించేందుకు వ్యూహరచనలు మొదలుపెట్టారు. అలాగే మునిసిపాలిటీల చైర్‌పర్సన్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలోని కార్పొరేషన్‌, ప్రధాన మునిసిపాలిటీల పీఠాలు అన్నీ మహిళలకే దక్కడం విశేషం.

శ్రీకాకుళం మేయర్‌గా మహిళ...

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థ(మునిసిపల్‌ కార్పొరేషన్‌) మేయర్‌ పదవిని ప్రభుత్వం ‘మహిళా’ (జనరల్‌) విభాగానికి రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనరల్‌ కేటగిరీకి చెందిన మహిళలు ఎవరైనా ఈ అత్యున్నత పీఠాన్ని అధిష్టించే అవకాశం లభించింది.

చైర్‌పర్సన్‌ స్థానాలన్నీ మహిళలకే...

జిల్లాలోని మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాల్లో కూడా మహిళలదే ఆధిపత్యం కొనసాగనుంది. పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ పదవులు ‘మహిళా(జనరల్‌)’ కేటగిరీకి కేటాయించారు. ఇచ్ఛాపురం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని బీసీ (మహిళ)కు రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. చైర్‌పర్సన్లతోపాటు మునిసిపాలిటీల్లోని వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా ఎన్నికల అథారిటీ ప్రకటించింది.

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ (36 వార్డులు) :

ఎస్టీ : మొత్తం 2 స్థానాలు (జనరల్‌ 1, మహిళ 1)

ఎస్సీ : మొత్తం 4 స్థానాలు (జనరల్‌ 2, మహిళ 2)

బీసీ : మొత్తం 13 స్థానాలు (జనరల్‌ 7, మహిళ 6)

మహిళ (జనరల్‌) : 10 స్థానాలు

అన్‌రిజర్వ్‌డ్‌ : 8 స్థానాలు (వీటిలో మహిళలకు కేటాయించినవి కాకుండా మిగిలినవి జనరల్‌ స్థానాలు వస్తాయి)

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ (28 వార్డులు) :

ఎస్టీ : 1 స్థానం (మహిళ 1)

ఎస్సీ : 1 స్థానం (మహిళ 1)

బీసీ : మొత్తం 12 స్థానాలు (జనరల్‌ 6, మహిళ 6)

మహిళ (జనరల్‌) : 8 స్థానాలు

అన్‌రిజర్వ్‌డ్‌ : 6 స్థానాలు

Updated Date - Oct 13 , 2026 | 12:09 AM