వైసీపీలో మావిగన్ కలవరం
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:21 AM
Ycp leaders tension with Jagan's new slogan రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాజాగా లేవనెత్తిన ‘మావిగన్’ పల్లవి.. జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే రాజధానిగా మావిగన్(మచిలీపట్నం, విజయవాడ, గుం టూరు)ను ఖరారు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జగన్ కొత్తపల్లవితో తలలు పట్టుకుంటున్న జిల్లా నేతలు
మూడు రాజధానులు దెబ్బకే జిల్లాలో జీరో
మళ్లీ అదే బాటలో అధినేత
మాజీమంత్రి ధర్మాన వత్తాసు
వ్యతిరేకిస్తున్న సాధారణ ప్రజలు
శ్రీకాకుళం, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాజాగా లేవనెత్తిన ‘మావిగన్’ పల్లవి.. జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే రాజధానిగా మావిగన్(మచిలీపట్నం, విజయవాడ, గుం టూరు)ను ఖరారు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అజెండాగా జరుగు తాయని.. మావిగన్ రాజధానిగా నచ్చినవారు వైసీపీకి ఓటు వేస్తారని స్పష్టం చేశారు. కాగా జిల్లాలో వైసీపీ శ్రేణులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గత ఎన్నికల్లో మూడు రాజధానుల ముక్కలాటతో జిల్లాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆపార్టీ నేతలు.. ఇప్పుడు ఏకంగా మావిగన్ పేరిట అధినేత వెళ్లగక్కుతున్న విషం చూసి నిస్సహాయ స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.
సిక్కోలు.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ వైసీపీ పట్టు పెంచుకునేకుందుకు గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా, ఆశించిన స్థాయిలో ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వలేదు. పాలనను గాలికొదిలేసి మూడు రాజధానుల పేరుతో ఆడిన నాటకానికి గత(2024) సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని కూటమి ప్రభుత్వం క్లీన్‌స్వీప్ చేసి కైవసం చేసుకుంది. జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇంతటి ఘోర పరాభవం తర్వాత కూడా అధినేత జగన్ తీరు మారకపోవడం జిల్లా నేతలకు మింగుడు పడటం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ అంటూ అందుకున్న కొత్తపల్లవిపై జిల్లాకు చెందిన మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వంత పాడటం గమన్హారం. అధినేత వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన అమరావతి రాజధానిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సాధారణ ప్రజల్లో సైతం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతోంది. అమరావతిపై కక్ష సాధింపు చర్యల వల్లే రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని భావిస్తున్న ప్రజలకు.. ఈ మావిగన్ అజెండా ఏమాత్రం రుచించడం లేదు.
డిపాజిట్లు గల్లంతే!
అధినేత తీరుతో ప్రజల్లో చులకనవుతూ, జిల్లాలో ఉన్న కాస్త పట్టును కూడా కోల్పోతున్నామని వైసీపీ శ్రేణులు బావురుమంటున్నాయి. మావిగన్ అజెండాతోనే ముందుకు వెళితే భవిష్యత్తులో డిపాజిట్లు కూడా గల్లంతవ్వడం ఖాయమన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే ఈవిషయాన్ని పార్టీ కార్యకర్తలు, మధ్యస్థ నాయకులు బహిరంగంగా చర్చించుకోలేని దుస్థితి నెలకొంది. అధినేతను కనీసం ప్రశ్నించలేక.. లోలోపల మదనపడుతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ పార్టీని మరింత పాతాళానికి తొక్కుతున్న జగన్ వ్యవహార శైలిపై అంతర్గతంగా కుమిలిపోతున్నారు. ‘గతంలో అమరావతిని వ్యతిరేకించాం. విశాఖ రాజధాని అని ఊరూవాడ ప్రచారం చేశాం. పాలనా రాజధానిగా చేయలేకపోయాం. కనీసం ఇప్పుడు రాజధాని విషయంలో మౌనంగా ఉంటే సరిపోయేది. ప్రజల్లో పలుచన కావడం ఖాయం’ అంటూ కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.