Share News

వైసీపీలో రచ్చ

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:28 PM

ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. మూడు గ్రూపులు ఎవరికి వారే యయునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

 వైసీపీలో రచ్చ

- ఆమదాలవలస నియోజకవర్గంలో మూడు గ్రూపులు

- వేర్వేరుగా సమావేశాలు

- జగన్‌ను మినహాయించి అందరూ విమర్శించుకోవడమే

శ్రీకాకుళం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు రచ్చకెక్కాయి. మూడు గ్రూపులు ఎవరికి వారే యయునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్‌ను మాత్రం విడిచిపెడుతున్నారు. తాజాగా, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్‌ (నాని).. వైసీపీ ముఖ్యనేతలు ధర్మాన సోదరులపై విమర్శలు ఎక్కుబెట్టారు. వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వారిని దుమ్మెత్తిపోశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఒక్క సీటు కూడా రాదంటూ సంచనలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.

దశాబ్దన్నర కాలం నుంచి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తమ్మినేని సీతారాం 2019లో వైసీపీ తరపున గెలుపొందారు. ఊహించని విధంగా స్పీకర్‌ పదవిని జగన్‌ కట్టబెట్టారు. 2024లో ఘోర ఓటమిని చవిచూశారు. అధికారంలో ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో జరిగిన పొరపాట్లు.. అక్రమాలు ప్రజల ద్వారా బయటకు వస్తున్నాయి. ఓ భూ వ్యవహారంలో ఏకంగా సీతారాం, అతని సతీమణి, కుమారుడు సైతం ఇరుక్కున్నారు. కొన్నిరోజులు అజ్ఞాతం బాటపట్టి బెయిల్‌ పొందాక బయటకు వచ్చారు. ఇటీవల నియోజకవర్గ సమావేశం ఆమదాలవలసలో జరిగింది. ‘కేసులు నమోదవుతున్నా తమ్మినేని సీతారాంను అరెసు చేయలేదని. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను మాత్రం ఓ కేసులో అరెస్టు చేసి జైలుకి పంపారని. ఇందుకు కారణం సీతారాంకు ఉన్న బంధుత్వమే’ అంటూ ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ వేదికపైనే అన్నారు. ఈ సమావేశానికి తమ్మినేని సీతారాం కూడా హాజరుకాలేదు. కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యలపై అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అభ్యంతరం చెప్పకపోవడంతో పార్టీలో సీతారాం పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది.

ఒక్కసీటూ రాదంటూ చిరంజీవి నాగ్‌ విమర్శలు

తమ్మినేని సీతారాంను వైసీపీ నాయకులే విమర్శించడం, వేదికపై కూర్చున్న ధర్మాన సోదరులు కూడా అడ్డుజెప్పకపోవడాన్ని తమ్మినేని కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. దీనిపై తాజాగా సీతారాం కుమారుడు చిరంజీవినాగ్‌ మీడియా సమావేశం నిర్వహించి ధర్మాన సోదరులపై, జిల్లా వైసీపీ నాయకుల తీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా రాదంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. తమ్మినేని సీతారాం ప్రాధాన్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నుంచి చింతాడ రవికుమార్‌ను ప్రోత్సహించడం.. అతనికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం.. వైసీపీ నాయకులు అతనికే మద్దతు ఇస్తుండటం తమ్మినేని వర్గానికి నచ్చడంలేదు.

- వైసీపీ అధికారంలో ఉండగానే తమ్మినేని, చింతాడ, సువ్వారి.. ఇలా మూడు గ్రూపులు ఉండేవి. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు సైతం వేర్వేరుగా నిర్వహించుకునేవారు. ఇప్పటికి కూడా గ్రూపుల గోల తగ్గలేదు దీంతో స్థానిక వైసీపీ కార్యకర్తలు అంతర్మథనం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జగన్మోహన్‌రెడ్డిని తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు చిరంజీవినాగ్‌ కలిశారు.

Updated Date - Sep 16 , 2026 | 11:28 PM