Share News

‘ఉపాధిహామీ’ని నీరుగార్చేశారు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:33 AM

'VBG Ramji' for the benefit of contractors ‘పేదల పాలిట సంజీవిని వంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చేసింది. దాని స్థానంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కొత్తగా వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చింద’ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపించారు.

‘ఉపాధిహామీ’ని నీరుగార్చేశారు
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి

కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే.. ‘వీబీజీ రామ్‌జీ’

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఆమదాలవలస/రణస్థలం మార్చి 16(ఆంధ్రజ్యోతి): ‘పేదల పాలిట సంజీవిని వంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చేసింది. దాని స్థానంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కొత్తగా వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చింద’ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపించారు. జాతిపిత మహాత్మాగాంధీ పేరును సైతం పథకం నుంచి తొలగించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఒక అభినవ గాడ్సే అని విమర్శించారు. ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం ఆమదాలవలస మండలం కొర్లకోట, రణస్థలంలోని దళితవాడలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఉపాధిహామీ పథకాన్ని దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ‘వలసలు నియంత్రించేందుకు, పేదలకు ఉపాధి కల్పించేందుకుగాను యూపీఏ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచిన ఈ పథకం.. లక్షలాది మంది వేతనదారులకు వరం. అటువంటిది గాంధీజీ పేరును తొలగించారు. కేంద్ర ప్రభుత్వ వాటాను తగ్గించారు. ఇది ముమ్మాటీకి పథకాన్ని నీరుగార్చడమే. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 1.10 కోట్ల జాబ్‌కార్డులు ఉండేవి. గడిచిన ఐదేళ్లలో 50 లక్షల కార్డులు, కేవలం గత ఏడాదిలోనే 18 లక్షల కార్డులు తొలగించారు. కొత్త చట్టం ప్రకారం 125 రోజులు పని కల్పిస్తామనడం పచ్చి బూటకం. పనివేళలను ఏకంగా 12 గంటలకు పెంచడం దారుణం. దాదాపు రూ.80వేల కోట్లను బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా ఈ చట్టాన్ని రూపొందించారు. గ్రామ్‌జీ చట్టం వల్ల రాష్ట్రంపై పెనుభారం పడుతుంది. పథకంలో 40 శాతం నిధులు రాష్ట్రమే భరించాలి. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టీడీపీ, జనసేన, వైసీపీ తాకట్టు పెట్టాయి. గ్రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసేవరకు ఉద్యమిస్తామ’ని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పాలనతోనే రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలవుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 150 రోజులకు ఉపాధిహామీ పనిదినాలు కల్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఉపాధి పనులు పూర్తిస్థాయిలో కల్పించకపోవడంతో వీధినపడ్డామని ఈశ్వరమ్మ అనే మహిళ షర్మిళ దృష్టికి తీసుకొచ్చారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని స్థానిక రైతులు కోరారు. దీనిపై షర్మిల సానుకూలంగా స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, కిల్లి కృపారాణి, డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణ, బొడ్డేపల్లి గోవింద్‌, గోపాల్‌, లఖినేని నారాయణరావు, సాయి షణ్ముఖరావు, వెంకటరమణ, దాలయ్య, ఏ.వెంకటనాయుడు, కె.సింహాద్రినాయుడు, లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:33 AM