Share News

అకాల వర్షం.. అపార నష్టం

ABN , Publish Date - May 01 , 2026 | 12:49 AM

Mango farmers suffer heavy losses అకాల వర్షంతో మామిడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. జిల్లాలో బుధవారం రాత్రి గాలుల బీభత్సంతోపాటు వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షం.. అపార నష్టం
టెక్కలి ప్రాంతంలో నేలరాలిన మామిడికాయలు

  • గాలీవాన బీభత్సంతో నేలరాలిన మామిడికాయలు

  • ఆందోళన చెందుతున్న రైతులు

  • టెక్కలి/ నరసన్నపేట/ కోటబొమ్మాళి/ వజ్రపుకొత్తూరు/ నందిగాం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): అకాల వర్షంతో మామిడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. జిల్లాలో బుధవారం రాత్రి గాలుల బీభత్సంతోపాటు వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6,676 ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. గాలీవాన బీభత్సానికి అత్యధికంగా కొత్తూరులో మామిడిచెట్లు, కాయలు నేలకొరిగాయి. జి.సిగడాం, కోటబొమ్మాళి, నందిగాం, సారవకోట, పలాస, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో కూడా మామిడి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. బంగినపల్లి, చెరుకురసం, సువర్ణరేఖ, కలెక్టర్‌, చక్రకేలి, నూజివీడు, కొబ్బరంటు, గోవా తదితర రకాల మామిడికాయలు నేలరాలడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

  • నరసన్నపేట మండలంలో జమ్ము, పోన్నానపేట, రావాడపేట, తామరాపల్లి, దశుమంతుపురం గ్రామాల్లో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

  • కోటబొమ్మాళి మండలంలో చీపుర్లపాడు, దంత, కురుడు, సౌడాం, యలమంచిలి, లఖందిడ్డి, పొడుగుపాడు, ఎత్తురాళ్ళుపాడు, చిన్నసాన తదితర గ్రామాల్లోని తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది.

  • దేవాది, కోమర్తి, మాకివలస, మడపాం జాతీయ రహదారికి అనుకొని ఉన్న సర్వీసు రహదారుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయాయి. జమ్ము, కరగాం తదితర గ్రామాల్లో నువ్వుపంటకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచు ప్రభావంతో అంతంతమాత్రమే దిగుబడి రాగా.. ప్రస్తుతం ఆ పంట కూడా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా.. జిల్లాలో మామిడి రైతులకు ఇన్స్యూరెన్స్‌పై అవగాహన కల్పించడంలో ఉద్యానవనశాఖ అధికారులు విఫలమయ్యారు. గతంలో హెక్టారు మామిడితోటకు రూ.1,800 ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం ఉండేది. కానీ దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇన్స్యూరెన్స్‌పై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో విపత్తుల సమయంలో నష్టపోతున్నా.. రైతులకు ఫలితం దక్కడం లేదు.

  • నేలకొరిగిన భారీ వృక్షం

  • నరసన్నపేట మండలం ఉర్లాంలో గాలుల తీవ్రతకు భారీ మర్రి వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో చెట్టు కింద ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ పంచాయతీ పరిధిలో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందిగాం మండలంలో విద్యుత్‌ వైర్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయింది. గురువారం విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ వైర్లను సరిచేసి.. సరఫరా పునరుద్ధరించారు.

Updated Date - May 01 , 2026 | 12:49 AM