Share News

యూనిట్లు 198.. దరఖాస్తులు 658

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:36 AM

ప్రభుత్వం సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రాలు, పరికరాలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది.

యూనిట్లు 198.. దరఖాస్తులు  658
మినీ ట్రాక్టర్లు

- మినీ ట్రాక్టర్లు, పవర్‌ వీడర్లకు పోటీ

- సిఫారసు లేఖలు ఇచ్చిన వారికే కేటాయింపు

-ఇదీ సీతంపేట ఐటీడీఏలో పరిస్థితి

- మెళియాపుట్టి మండలం జంతూరు గ్రామానికి చెందిన బందపల్లి గవిరేష్‌ అనే రైతుకు మూడు ఎకరాల వరకు జీడి తోటలు ఉన్నాయి. తోటలో దుక్కి చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం రాయితీపై అందించే పవర్‌ వీడర్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ప్రజాప్రతినిధి నుంచి సిఫారసు లేఖ తీసుకురావాలని అధికారులు కోరడంతో గవిరేష్‌ ఆందోళన చెందుతున్నాడు.

- మెళియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన పదనాపురం కృష్ణారావుకి ఐదు ఎకరాల మెట్టు భూమి ఉంది. ఆయన ఇటీవల మినీ ట్రాక్టర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తక్కువ యూనిట్లు ఉండడంతో మినీ ట్రాక్టర్‌ ఇవ్వలేమని చెప్పి వ్యవసాయ అధికారులు పవర్‌ టిల్లర్‌ ఇచ్చారు.

మెళియాపుట్టి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రాలు, పరికరాలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. వీటి కోసం అధికారులు ఏప్రిల్‌ నెలాఖరు వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే, గతంలో స్పేయర్లు వంటి వాటికి డిమాండ్‌ ఉం డేది. ఇప్పుడు భారీగా సబ్సిడీ ఉండడంతో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్‌ వీడర్లకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వీటి కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ ఏడాది దరఖాస్తులు అధికంగా రావడంతో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఉన్నవారికే అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ సీతంపేట ఐటీడీఏలో మాత్రం సిఫారసు లేఖలు ఇచ్చిన వారికే యంత్రాలు కేటాయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న ట్రాక్టర్‌కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రాయితీ ఉండడంతో అధికంగా రైతులు పోటీ పడుతున్నారు.

యూనిట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో 198 యూనిట్లు మంజూరు కాగా, దరఖాస్తులు మాత్రం 658 వరకు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. పవర్‌ వీడర్స్‌ 53 యూనిట్లకు 253 దరఖాస్తులు, ఆయిల్‌ ఇంజన్లు 80 యూనిట్లకు 93 దరఖాస్తులు, పవర్‌ టిల్లర్లు 28 యూనిట్లకు 184 దరఖాస్తులు, మల్టీ క్రాప్‌ ట్రాక్టర్‌ 12 యూనిట్లకు ఏడు దరఖాస్తులు, మినీ ట్రాక్టర్లు 25 యూనిట్లకు 121 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, యూనిట్లు తక్కువ దరఖాస్తులు ఎక్కువ రావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేక తర్జనభర్జన పడుతున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఇచ్చిన వారికి యంత్రాలు కేటాయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై సీతంపేట ఐటీడీఏ హర్టికల్చర్‌ ప్రాజెక్టు అధికారి ఎస్‌వీ గణేష్‌ను వివరణ కోరగా.. ‘గత ఆరేళ్ల నుంచి వ్యవసాయ యాంత్రీకరణ కోసం నిధులు మంజూరు జరగలేదు. ప్రస్తుతం ఇస్తున్న పరికరాలకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో 2018-19 బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరిగింది. అయినప్పటికీ నిధులు మంజూరు చేయకపోవడంతో పరికరాలు ఇవ్వలేదు. అప్పటి నిధులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంజూరు చేయడంతో ఆ యంత్రాలను రైతులకు అందిస్తున్నాం.’ అని తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 12:36 AM