Share News

మరణంలోనూ ఒక్కటై..

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:25 AM

Husband and wife die due to illness ఏడు పదులు అనుబంధం వారిది. కష్టసుఖాల్లో తోడుగా నడిచారు. ఆ అడుగులు ఆఖరి పయనంలోనూ విడిపోలేదు. ‘నువ్వులేని లోకంలో ఎలా ఉంటాను’ అనుకుందేమో ఏమో, భర్త గుండె ఆగిన మరుక్షణమే.. ఆయన పాదాల వద్దే ప్రాణాలు విడిచింది. నిమిషాల వ్యవధిలోనే ఆ రెండు దీపాలు ఆరిపోయాయి. బతికినంత కాలం ఒకరికొకరు తోడు, నీడగా ఉన్న ఆ వృద్ధదంపతులు.. మరణంలోనూ తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.

మరణంలోనూ ఒక్కటై..
దాలెప్పడు, కాంతమ్మ(ఫైల్‌)

అనారోగ్యంతో భర్త మృతి

ఆ వెంటనే భార్య కూడా..

పాదాల వద్ద ప్రాణాలు విడిచి..

నిమిషాల వ్యవధిలోనూ ఇద్దరూ..

రామజోగిపేటలో తీవ్ర విషాదం

ఎచ్చెర్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఏడు పదులు అనుబంధం వారిది. కష్టసుఖాల్లో తోడుగా నడిచారు. ఆ అడుగులు ఆఖరి పయనంలోనూ విడిపోలేదు. ‘నువ్వులేని లోకంలో ఎలా ఉంటాను’ అనుకుందేమో ఏమో, భర్త గుండె ఆగిన మరుక్షణమే.. ఆయన పాదాల వద్దే ప్రాణాలు విడిచింది. నిమిషాల వ్యవధిలోనే ఆ రెండు దీపాలు ఆరిపోయాయి. బతికినంత కాలం ఒకరికొకరు తోడు, నీడగా ఉన్న ఆ వృద్ధదంపతులు.. మరణంలోనూ తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ రామజోగిపేట గ్రామానికి చెందిన పిల్లాటి దాలెప్పడు (89), కాంతమ్మ (79) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ దంపతులది 70 ఏళ్ల అనురాగ బంధం. వృద్ధాప్యం పైబడినా, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినా వారి దాంపత్యంలో అనురాగం ఏనాడూ తగ్గలేదు. ఓ వైపు కాంతమ్మ కేన్సర్‌తో బాధపడుతోంది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు భాస్కరరావు స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. చిన్న కుమారుడు మోహనరావు కూడా స్వగ్రామంలో కోళ్లఫారం నడుపుతున్నాడు. రెండో కుమారుడు పాపారావు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. శ్రీకాకుళంలో ఉంటున్నారు. ముగ్గురు కుమారులూ వేర్వేరుగా ఉంటున్నారు. కాగా.. ఆ వృద్ధ దంపతులు మాత్రం ఒకరికొకరు ఆసరాగా నిలుస్తూ కాలం వెల్లదీస్తున్నారు.

సోమవారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మూత్రవిసర్జన కోసం వెళ్లిన దాలెప్పడు ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. పక్క ఇంట్లో ఉంటున్న పెద్ద కుమారుడు భాస్కరరావు ఆ శబ్దం విని, కంగారుగా బయటకు వచ్చి ఆ పరిస్థితిలో తండ్రిని చూసి పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఇంట్లో ఉన్న కాంతమ్మ ఆందోళన చెంది బాత్‌రూమ్‌లో కిందపడిన భర్తను చూసి షాక్‌కు గురైంది. తీవ్రమైన దిగ్ర్భాంతికి గురైన ఆమె, ఆయన పాదాల చెంతనే కిందపడి ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిద్దరినీ అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

మంగళవారం ఉదయం పక్కపక్కనే చితిని పేర్చి ఆ ఇద్దరి దహన సంస్కారాలు జరుగుతుంటే ఆ దృశ్యాన్ని చూసి ఊరంతా కన్నీటి సంద్రమైంది. జీవించినంత కాలం ఒకరికొకరు తోడై మెలిగారు. కడవరకు ఆ బంధాన్ని కాపాడుకుంటూ మరణంలోనూ ఒక్కటయ్యారు అని గ్రామస్థులు కంటతడిపెట్టారు.

Updated Date - Aug 12 , 2026 | 12:25 AM