మారని బతుకులు
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:37 AM
Tribal areas remain far removed from development ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికీ నడవడానికి కూడా వీల్లేని రాళ్లబాట, కొండపైన కమ్మల ఇళ్లల్లో.. పోడు వ్యవసాయం చేస్తూ.. చాలామంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.
అభివృద్ధికి దూరంగా గిరిజన ప్రాంతాలు
చాలా గ్రామాలకు కానరాని రహదారి
తాగునీటికీ తప్పని ఇబ్బందులు
అందుబాటులో లేని పాఠశాలలు
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
మెళియాపుట్టి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి)
మెళియాపుట్టి మండలం కేరాశింగి గ్రామానికి చెందిన జన్ని జమ్మమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఎకరా భూమిలో వరిసాగు చేస్తోంది. తినడానికి ఇబ్బంది లేదు. కానీ కుమార్తెల వివాహాలు, ఇతర ఖర్చులకు మాత్రం అప్పు చేయాల్సి వచ్చింది. కొండపై ఉండడంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని జమ్మమ్మ వాపోతోంది.
టెక్కలి మండలం లంకపాడు గ్రామానికి చెందిన ఎస్.బాబూరావుకు ఇద్దరు పిల్లలు. బాబూరావు దంపతులు టెక్కలిలో సిమెంట్ పనులకు వెళితే వారిద్దరికీ రోజుకు రూ.వెయ్యి వస్తుంది. పనిలేకపోతే బతుకు కష్టమే. అప్పు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని బాబూరావు చెబుతున్నాడు.
ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికీ నడవడానికి కూడా వీల్లేని రాళ్లబాట, కొండపైన కమ్మల ఇళ్లల్లో.. పోడు వ్యవసాయం చేస్తూ.. చాలామంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను వివిధ కార్పొరేషన్లకు మళ్లించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డోలీ మోతలు లేని గ్రామాలుగా.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. కానీ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని గ్రామాల్లో మెటల్ వేసి వదిలేయడంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు కూడా అందుబాటులో లేక పొలాల గట్లు.. రాళ్లు తేలిన రహదారులపై రెండు.. మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ విద్యార్థులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఆదివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో గిరిజనుల సమస్యలపై కథనం..
ఇదీ పరిస్థితి
ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలో 848 గిరిజన గ్రామాల్లో 1.60 లక్షల మంది నివసించేవారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాకు 378 గ్రామాలు, శ్రీకాకుళంలో 470 గ్రామాలు కేటాయించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. కానీ అభివృద్ధి మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. రోడ్లు లేని గిరిజన గ్రామాలు 145 ఉన్నట్టు గుర్తించారు. వీటిలో తొలివిడతగా 72 రోడ్లకు సంబంధించి రూ.51.92 కోట్లు మంజూరు చేశారు. కానీ పనులు పూర్తికాలేదు.
కొండపై గిరిజన గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సోలార్ పంపుసెట్లు పూర్తిగా పాడైపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఊటనీరే దిక్కు అవుతోంది. ‘జల్‌జీవన్’ నిధులు మంజూరు చేసినా పనులు పూర్తికాలేదు. మెళియాపుట్టి మండలంలో దబ్బగుడ్డి, పెద్దకేదారి తదితర గ్రామాల గిరిజనులు సుదూర ప్రాంతంలోని పొలాల్లో బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఏజెన్సీలో 150 గిరిజన ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతులకు దూరంగా ఉన్నాయి. మెళియాపుట్టి మండలంలో దబ్బగుడి గ్రామ గిరిజన విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దకేదారి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గేటుపేట గ్రామ విద్యార్థులది కూడా ఇదే పరిస్థితి. చిన్నకేదారిలో పాఠశాల భవనం లేక అంగన్‌వాడీ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా చాలా గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేక.. దూరప్రాంతాలకు నడిచివెళ్లలేక చాలా మంది చదువుపై ఆసక్తి చూపడం లేదు.
గిరిజన గ్రామాల్లోని 21 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 8 ఫీడర్ అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయి. సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 29 సెల్‌టవర్లు ఏర్పాటు చేసినా.. ప్రయోజనం లేకపోతోంది. సాంకేతిక సమస్యలతో సిగ్నల్స్ అందక టవర్లు నిరుపయోగంగా మారుతున్నాయి.
సీతంపేట ఏజెన్సీ పరిధిలో సుమారు 6వేల ఎకరాల్లో వరిని పండిస్తున్నారు. పోడు వ్యవసాయంపైనే అధికశాతం మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. కాగా.. పంటలకు జీసీసీ సరైన మద్దతు ధర కల్పించకపోవడంతో వారపు సంతల్లోనే ఉత్పత్తులు విక్రయిస్తున్నామని గిరిజనులు పేర్కొంటున్నారు. దళారుల జోక్యంతో నష్టపోతున్నామని వాపోతున్నారు.
ఐటీడీఏ లేక ఇబ్బందులు
జిల్లా పునర్విభజన తర్వాత సీతంపేట ఐటీడీఏ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం కావడంతో.. తమ సమస్యలు పరిష్కారం కాని దుస్థితి నెలకొందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ పనులు చేపడుతున్నా పరిశీలన లేక నాణ్యత పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీతంపేట ఐటీడీఏకు కూడా గత మూడేళ్ల నుంచి ఇన్‌చార్జి పీవోలే కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. తమ ప్రాంతాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రహదారి లేదు
మా గ్రామానికి ఇప్పటికీ రహదారి లేక ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు మూడు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి పిల్లలు చదువుకుంటున్నారు. గ్రామంలో అభివృద్ధిని పట్టించుకునేనాథుడు లేడు.
- నెలబొంతు కృష్ణారావు, దబ్బగుడ్డి
మా గ్రామాలకు అధికారులు రారు
మా గ్రామాల వైపు అధికారులు ఎవరూ రావడం లేదు. మేం ఎక్కడ ఉన్నామో కూడా వారికి తెలియడం లేదు. రోడ్డు నిర్మించాలని అధికారులను వేడుకుంటున్నా కనికరించడం లేదు. వైద్యసేవలు అత్యవసరమైనప్పుడు డోలీ కట్టుకుని బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.
సవర రమేష్, దబ్బగూడ