వికసించని మొగలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:28 AM
Reduced Mughal flower production ఈ ఏడాది జిల్లాలో మొగలిపూల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకూ పూల సేకరణ జరుగుతుంది. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా సేకరణ జరగలేదు. దీంతో రైతులతో పాటు సేకరించేవారికి ఉపాధి లేకుండా పోయింది.
ఏటా తగ్గిపోతున్న తగ్గిన పూల ఉత్పత్తి
జిల్లాలో పడిపోయిన సేకరణ
రైతులకు, కార్మికులకు కరువైన ఉపాధి
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో మొగలిపూల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకూ పూల సేకరణ జరుగుతుంది. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా సేకరణ జరగలేదు. దీంతో రైతులతో పాటు సేకరించేవారికి ఉపాధి లేకుండా పోయింది. తీర ప్రాంతాల్లో మొగలి పంట విస్తారంగా ఉండేది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, సంతబొమ్మాళి, శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో మొగలి సాగు అధికం. తీర మండలాల్లో దాదాపు 6 వేల హెక్టార్లలో పంట సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్దానంలో కొబ్బరి అంతర పంటగా ఎక్కువగా సాగవుతోంది. పొలాలకు కంచె వేసే క్రమంలో మొగలిని నాటుతుంటారు. ఇవి క్రమేపీ పెరుగుతాయి. పొలం గట్లతోపాటు తీర ప్రాంతానికి మొగలి చెట్లు రక్షణ కవచంలా ఉంటాయి. అయితే తుఫాన్లకు, ఈదురు గాలులకు ఇవి నేలకొరుగుతున్నాయి. దీంతో మొగలి సాగు గణనీయంగా తగ్గముఖం పడుతోంది. ప్రభుత్వం పంటల జాబితాలో చేర్చకపోవడంతో వీటికి సంబంధించి పరిహారం కూడా దక్కడం లేదు.
మొగలి రసం లీటరు రూ.2 లక్షలు
ఉద్దానం ప్రాంతంలో మొగలిపూలు ఎక్కువగా సేకరిస్తుంటారు. ఈ పూలు అత్తరు, సుగుంధ ద్రవ్యం తయారీలో వినియోగిస్తారు. అందుకే ఉద్దానం వ్యాప్తంగా అప్పట్లో మొగలి నుంచి రసాయనం తీసే పరిశ్రమలు వెలిశాయి. వీటిద్వారా వందలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. బట్టీలుగా పిలుచుకునే పరిశ్రమల వద్ద భారీ సైజులో ఉండే రాగిపాత్రలో మరిగించి ఆవిరి రూపంలో రసాన్ని తీస్తారు. ఈ రసాన్ని మరో రాగిపాత్రలో నిల్వ చేస్తారు. దానిని అత్తరుతోపాటు అగరవత్తుల తయారీలో వినియోగిస్తారు. మొగలి రసం లీటరు రూ.2లక్షల వరకూ పలుకుతుంది. బరంపురం, భువనేశ్వర్, జయ్‌పూర్, కోల్‌కత్తా వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి పూలతోపాటు రసాన్ని కొనుగోలు చేస్తుంటారు. కంచిలి, కవిటి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు లారీల్లో మొగలి పూలు తరలిస్తుంటారు. ఏటా దాదాపు 100 లోడ్ల వరకూ వెళ్తుండేవి. ఈ ఏడాది మాత్రం మొగలి చెట్ల నుంచి పూలు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో కనీసం 30లోడ్లు కూడా వెళ్లలేదని కార్మికులు వాపోతున్నారు.
సేకరణ చాలా కష్టం
ఒక్కో మొగలి చెట్టుకు వందల్లో పూలు పూస్తాయి. ఒక్కో పువ్వు రూ.10 నుంచి రూ.12 వరకూ పలుకుతుంది. మొగలిపూల సేకరణ కత్తిమీద సాము. చెట్టుకొమ్మన పువ్వు పూస్తుంది. మొగలిచెట్లు గుబురుగా ఉంటాయి. పైగా ఆకులకు ముళ్లు ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రంపం మాదిరిగా దాని ముళ్లు చేయిని కోస్తాయి. దీనికితోడు మొగలి చెట్లుపై పాములు సంచరిస్తుంటాయి. మరోవైపు ఉద్దానంలో గుబురుగా ఉండే మొగళి చెట్ల మధ్య ఎలుగుబంట్లు సేదదీరుతుంటాయి. ఇన్ని ప్రమాదాల మధ్య మొగలిపూలు సేకరించినా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు కావడం లేదు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తున్న మొగలిని వాణిజ్య పంటగా గుర్తించాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు.
ఈ ఏడాది ఉపాధి లేదు
ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా మొగలిపూల ఉత్పత్తి లేకపోవడంతో ఉపాధి కరువైంది. వర్షాభావ పరిస్థితులతో మొగలిపూలు దొరకలేదు. ఏటా వంద లారీలోడ్లకుపైగా కవిటి, కంచిలి నుంచి వెళ్లేవి. కానీ ఈ ఏడాది 30 లోడ్లులోపే వెళ్లాయి.
- డొంబురు, మొగలి సేకరణ కార్మికుడు, ఇచ్ఛాపురం
వర్షాభావ పరిస్థితులే కారణం
ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మిపురం, చిన్నలక్ష్మిపురం, బూర్జపాడు గ్రామాలతోపాటు కవిటి, కంచిలి మండలాల్లో మొగళి పూల ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులే. దీంతోపాటు పంటకు సరిపడా ఎరువులు వాడకపోవడంతో దిగుబడి తగ్గింది. మన ప్రాంతాల్లో మొగలిని వాణిజ్య పంటగా కాకుండా కేవలం గట్లపైనే అంతర్ పంటగా పండిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మొగలి సాగుకు సరిపడా ఎరువులు వేసి, నీరుపెట్టడం, దున్నటం, కలుపుతీయడం వంటివి చేస్తారు. అందుకే పంటలు సమృద్ధిగా పండుతాయి. మన ప్రాంతాల్లో కూడా ఈ విధానాలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
- రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ ఏడీ