హైవేపై అనుమతుల్లేని వ్యాపారాలకు వీల్లేదు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:38 PM
New Trauma Care Centers జాతీయ రహదారిపై అనుమతుల్లేని వ్యాపార సంస్థలు, హోటళ్లు, దాబాలు నిర్వహించడానికి వీల్లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
గోల్డెన్ అవర్‌లో వైద్యం కోసం కొత్త ట్రామాకేర్ సెంటర్లు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అనుమతుల్లేని వ్యాపార సంస్థలు, హోటళ్లు, దాబాలు నిర్వహించడానికి వీల్లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘హైవేపై నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే వ్యాపార సముయాలను తక్షణమే సీజ్ చేస్తాం. రోడ్డ ప్రమాదాల నివారణకు రవాణాశాఖ నోడల్ విభాగంగా, మహిళలు, పిల్లల భద్రతకు పోలీసు శాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తాయి. రహదారులపై భద్రత పెంపుదలే లక్ష్యం. ప్రతీ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమన్వయం చేసుకోవాలి. రానున్న రెండు వారాల్లో 12 రూర్బన్, 4 మునిసిపాలిటీల్లో అధికారులంతా క్షేత్రస్థాయిలో రోడ్ల భద్రతను పరిశీలించాలి. ప్రాణాంతక ప్రమాదాలు జరిగిన వెంటనే మోటారు వాహనశాఖ, పోలీసు, రహదారులు భవనాల శాఖల అధికారులు ఉమ్మడిగా ఘటనా స్థలాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలి. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర సేవలందించేందుకు కొత్త ట్రామాకేర్ సెంటర్లు, 19 నెట్‌వర్క్ ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాల’ని తెలిపారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘జిల్లాను మాదకద్రవ్యరహితంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై రౌడీషీట్ల తరహాలో లైంగిక నేరస్థుల షీట్లు తెరిచాం. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, పోలీసు నిఘాతో పాటు ఐసీడీఎస్, స్థానిక సంస్థల సమన్వయంతో రక్షణ చర్యలు చేపడుతున్నాం. ఫ్లైఓవర్ల కింద స్థలాలను శుభ్రం చేసి క్రీడాస్థలాలుగా మార్చుతాం. సీసీ కెమెరాలు, లైటింగ్ వసతులు కల్పించి.. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పిస్తామ’ని తెలిపారు. హైవేలపై దాబాలను నడిపేవారు ‘రాజమార్గ ప్రవేశ్’ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.