Share News

శ్రీకాకుళం జిల్లాలో రెండోవిడత ఏకగ్రీవ పంచాయతీలు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:09 AM

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది.

శ్రీకాకుళం జిల్లాలో రెండోవిడత ఏకగ్రీవ పంచాయతీలు..
పొందూరు: అధికారులకు నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న చిరంజీవిరావు

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. దీంతో కొన్ని చోట్ల సర్పంచ్‌ అభ్యర్థులుగా, వార్డు సభ్యులుగా ఒక్కొక్క నామినేషన్‌ రావడంతో ఆయా పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం కానున్నాయి.

సరుబుజ్జిలిలో రెండు..

సరుబుజ్జిలి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. యరగాం పంచాయతీలో టీడీపీ మద్దతుదారు గురువు కీర్తి ఒక్కరే సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయగా.. ఎనిమిది వార్డులకు గాను ఐదు టీడీపీ మద్దతుదారులు, మూడు వైసీపీ మద్దతుదారులు ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. అలాగే పెద్దపాలెం పంచాయతీ (ఎస్సీ రిజర్వేషన్‌) సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ మద్దతుదారు బొమ్మాది మోహన్‌రావు ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఎనిమిది వార్డులకు కూడా ఒక్కొక్కరే నామినేషన్‌ వేయడంతో ఇవి కూడా ఏకగ్రీవం కానున్నాయి.

హిరమండలం పరిధిలో రెండు..

హిరమండలం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. గత మూడు రోజులుగా సాగిన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. దీంతో మర్రిగూడ, పెద్దగూడ పంచాయతీలకు సర్పంచ్‌ అభ్యర్థులుగా, వార్డు సభ్యులుగా ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. దీంతో ఈ రెండు పంచాయతీలు ఏకగ్రీవ మయ్యాయి. మర్రిగూడ నుంచి సవర సుజాత, పెద్దగూడ నుంచి సవర మాసయ్య మాత్రమే సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

ఎమ్మెల్యే కూన రవికుమార్‌ స్వగ్రామం..

పొందూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ స్వ గ్రామం పెనుబర్తి గ్రామంలో సర్పం చ్‌తోపాటు వార్డు సభ్యులంతా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌ అభ్యర్థిగా కూన వెంకట చిరంజీవిరావు (గోపి)తోపాటు ఎనిమిది వార్డులకు కూడా ఒక్కొక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో సర్పంచ్‌తోపాటు వార్డులు ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించడం జరిగిందని ఎంపీడీవో వాసుదేవరావు తెలిపారు.

పాతపట్నం మండలంలో ఏఎస్‌ కవిటి..

పాతపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండల పరిధి ఏఎస్‌ కవిటి పంచాయతీ సర్పంచ్‌ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. దీంతో సర్పంచ్‌ అభ్యర్థిగా లోవ గౌరమ్మ ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఈ పంచాయతీ ఏకగ్రీవం కానున్నది. నామినేషన్‌ పరిశీలన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

సమస్యాత్మక పంచాయతీ కూడా..

మెళియాపుట్టి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఏ ఎన్నికలు జరిగినా ఆ పంచాయతీలో గొడవలు జరగ డం పరిపాటిగా వస్తుంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏకగ్రీ వం కావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే వసుంధర పంచాయతీ. గత రెండు దశాబ్దాలు గా ఈ వసుంధరను సమస్యాత్మక పంచాయతీగా అధికారులు గుర్తించా రు. ఏ ఎన్నిక జరిగినా అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేవారు. అయితే ఈసారి మాత్రం గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలని ఇరువర్గాల మధ్య సయోద్య కుది రింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు, మాజీ ఎంపీపీ సలాన మోహనరావు భార్య రాజేశ్వరి సర్పంచ్‌ అభ్యర్థిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారంతో రాజేశ్వరి ఒక్కరే సర్పంచ్‌ అభ్యర్థిగా నామనేషన్‌ వేయడంతో ఈ పంచాయతీ ఏకగ్రీవం కానున్నది.

Updated Date - Nov 21 , 2026 | 12:09 AM