Share News

అత్తింటి నరకం భరించలేక..

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:32 AM

భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఓ వివాహిత తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

 అత్తింటి నరకం భరించలేక..
పూజ(ఫైల్‌, కుశ్వంత్‌ (ఫైల్‌), దీక్షిత (ఫైల్‌)

మృత్యువుకు ఎదురేగి!

- పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

- రైలు కిందపడి బలవన్మరణం

- భర్త, అత్తింటి వేధింపులే కారణమంటున్న మృతురాలి తల్లి

-చలమయ్యపేటలో విషాదం

అమ్మ వెంట రమ్మంది. చెయ్యి పట్టుకుని నడిచారు. ఆ పిల్లలు ఎక్కడికో అనుకున్నారు. మృత్యుదరికెళ్తున్నామని మాత్రం తెలియదు. కానీ ఆ తల్లికి తెలుసు. ఇదే తమకు ఆఖరు రోజని!

అత్తింట్లో నరకం చూసింది. భర్త మాటలు గాయపర్చాయి. పుట్టింటి వారు సర్దుకు పొమ్మన్నారు. అయినా భరించింది. కానీ వేధింపులు ఆగలేదు. ఇక ఆమె ఒంటరిదైంది. చావే శరణ్యమని భావించింది.

తన తర్వాత ఇద్దరు పిల్లలు అనాథలు కాకూడదనుకుంది. వెంట బెట్టుకుని వెళ్లింది. రోజంతా మౌనంగా ఏడ్చింది. చీకటిపడ్డాక పిల్లలతో పట్టాల వైపు నడిచింది. రైలు రూపంలో వచ్చిన మృత్యువును హత్తుకుంది. అంతే.. తల్లి, ఆ ఇద్దరు పిల్లలు విగతజీవులయ్యారు.

పలాస, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఓ వివాహిత తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. కోటబొమ్మాళి మండలం చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజ అలియాస్‌ దివ్య (29), కుశ్వంత్‌(7), కుమార్తె దీక్షిత(4)తో కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. వేకువజామున(శుక్రవారం) ఆ ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన స్థానికులు కొంతమంది ఈ విషయాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల కారణంగానే తన కుమార్తె పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి గొరకల అన్నపూర్ణ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎనిమిదేళ్ల కిందట వివాహం..

తర్లిపేట పంచాయతీ చలమయ్యపేటకు చెందిన వెంకటరమణకు, సంతబొమ్మాళి మండలం భావనపాడుకు చెందిన పూజకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వెంకటరమణ తన భార్యా పిల్లలతో కలిసి విజయవాడలో ఉంటూ ప్రైవేటు విద్యుత్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల నుంచి అత్త, భర్త, ఆడపడుచులు తనను వేధిస్తున్నట్లు పూజ తన తల్లి అన్నపూర్ణకు చెప్పింది. కుటుంబం అన్నాక గొడవలు సాధారణమేనని, సర్దుకుపోవాలని తల్లి చెప్పింది. అన్నపూర్ణకు పూజతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారంతా పలాస మండలం నీలావతి ప్రాంతంలో వారి భర్తలు, పిల్లలతో ఉంటున్నారు. వారు కూడా పూజ వ్యవహారంలో కలుగజేసుకొని భర్త వెంకటరావు, అత్త పాపమ్మకు నచ్చజెప్పారు. ఇటీవల పూజ వేసవి సెలవుల కోసం నీలావతి గ్రామానికి వచ్చి 15 రోజుల పాటు ఉండి వెళ్లింది. అనంతరం చలమయ్యపేటకు వెళ్లగా బుధవారం రాత్రి నుంచి తీవ్ర గొడవలు ప్రారంభమైనట్లు పూజ తల్లి ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు పూజ, తన ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి(చలమయ్యపేట) బయటకు వెళ్లిపోయారు. అనంతరం పలాస రైల్వే స్టేషన్‌ వద్ద ఫ్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకొని స్టేషన్‌లోకి ప్రవేశించారు. భర్త పనిచేసే విజయవాడ వెళ్లడమా, తల్లి ఉండే భావనపాడు, అక్కలు ఉండే నీలావతి వెళ్లడమా అనే సందేహంలో స్టేషన్‌లోనే ఉండిపోయారు. తనకు ఎక్కడా సేఫ్‌ కాదని, మరణించడమే ఒక్కటే మార్గమని ఆమె భావించారో ఏమో.. అర్ధరాత్రి దాటిన తరువాత స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో నడుచుకుంటూ వెళ్లి భువనేశ్వర్‌ వెళ్లే ప్రధాన రైలుమార్గంలో పిల్లలతో కలిసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది.


ట్రాక్‌మధ్యలో ఉండి..

పూజ, ఆమె పిల్లలు కుశ్వంత్‌, దీక్షిత చిమ్మచీకటిలో ఎటువంటి వెలుగులు లేని ప్రాంతంలో రైలుపట్టాల వద్దకు చేరుకున్నారు. బండి వస్తున్న సమయంలో రైలుపట్టాల మధ్య ఉండిపోయినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలబట్టి తెలుస్తోంది. వీరి ముగ్గురి తలల భాగంలో తీవ్ర గాయలు ఉండగా మిగిలిన భాగాలు అన్నీ సక్రమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు ఢీకొన్న వెంటనే వీరు మరణించినట్ల్లు స్పష్టమవుతోంది. బాబు కుశ్వంత్‌ ముందుగా మరణించగా, తరువాత తల్లి పూజ, కుమార్తె దీక్షిత మృతదేహాలు పక్కపక్కనే పడిఉన్నాయి. రైల్వే, స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలు పడిఉన్న తీరు చూసి చలించిపోయారు. మృతదేహాలన్నీ కరగట్టి పోవడంతో అర్ధరాత్రి తరువాత ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

భర్త, అత్త, ఆడపడుచులే కారణం

భర్త వెంకటరావు, అత్త, ముగ్గురు ఆడపడుచుల వేధింపులు కారణంగానే తన కుమార్తె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని దివ్య తల్లి అన్నపూర్ణ ఆరోపిస్తున్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఆరు నెలల నుంచి సున్నాదేవిలో మరో కుమార్తె వద్ద ఉంటున్నానన్నారు. ఆరు నెలల నుంచి అత్తింటి వారు వేధిస్తున్నట్లు దివ్య తనతో చెప్పిందన్నారు. కుటుంబం అన్నాక గొడవలు సాధారణమేనని, సర్దుకుపోవాలని నచ్చజెప్పానన్నారు. బుధవారం రాత్రి నుంచి దంపతుల మధ్య తీవ్ర గొడవలు ప్రారంభమైనట్లు అన్నపూర్ణ ఆరోపిస్తున్నారు. ‘దివ్య తన పిల్లలతో కలిసి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయటకు వచ్చేశారు. దీనిపై భర్త, ఆయన కుటుంబీకులు కనీసం కూడా ఆరా తీయలేదు. ఎక్కడికి వెళ్తుందో కూడా అడగలేదు. నేను ఫోన్‌ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై గురువారం రాత్రి కోటబొమ్మాళి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంటి నుంచి వెళ్లిన వెంటనే అత్తింటి వారు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. నా కుమార్తె జీవితాన్ని నాశనం చేశారు. వారంతా కిలాడీలు.’అని అన్నపూర్ణ ఆరోపించారు.


ఆలస్యంగా వచ్చిన రైల్వే పోలీసులు

పలాస రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. శుక్రవారం వేకువజామున వెలుగులోకి వచ్చింది. స్థానికులు అంతా అక్కడకు చేరుకుని అయ్యో అని తీవ్ర వేదనతో ఉండగా రైల్వే పోలీసులు మాత్రం ఉదయం 10 గంటలకు వచ్చారు. 8 గంటల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్‌, తరువాత మరో మహిళా కానిస్టేబుల్‌ వచ్చి తమ ఉన్నతాధికారులు వస్తేగాని మృతదేహాలను తీయలేమని చెప్పుకొచ్చారు. సంఘటనా స్థలానికి 200 అడుగుల దూరంలో పోలీస్టేషన్‌ ఉన్నా అధికారులు నడుచుకుంటూ రావడానికి మూడు గంటల సమయం కావాల్సి వచ్చింది. రైల్వేశాఖలో ప్రమాదాలు జరిగితే సంబంధిత స్టేషన్‌మేనేజర్‌, కీమన్‌, గార్డులు, డ్రైవర్లు మెమో ఆర్డర్‌ ఇస్తేగాని రైల్వేపోలీసులు స్పందించరన్నది స్పష్టమవుతోంది. దీనిపై విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

చలమయ్యపేటలో విషాదం

కోటబొమ్మాళి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): చలమయ్యపేటకు చెందిన పూజ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఇక్కడ అత్తింటి వారు మరోలా చెబుతున్నారు. పూజ భర్త వెంకటరమణ తల్లి పాపమ్మ గత కొనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం దిగలేని పరిస్థితిలో ఉంది. ఇదే గ్రామంలో నివాసముంటున్న పాపమ్మ చిన్నకూతురు శాంతమ్మ తల్లి బాగోగులు చూసుకొనేది. పది నెలల కిందట శాంతమ్మ భర్త వెంకటేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమెకు గ్రామానికి దగ్గరలో ఉన్న టిఫిన్‌ దుకాణంలో పని చేస్తూ తల్లితో పాటు తన ఇద్దరు ఆడపిల్లలను చూసుకునేది. ‘ఇక నుంచి అమ్మవద్ద నీ భార్యను ఉంచి, మీ పిల్లలను ఊర్లో ఉన్న పాఠశాలలో చదివించుకోమని’ తన అన్న వెంకటరమణకు శాంతమ్మ చెప్పింది. ఇదే విషయాన్ని ఆయన తన భార్య పూజకు చెప్పాడు. తాను విజయవాడ పనికి వెళ్లి అప్పుడప్పుడు వస్తాను అని పూజకు చెప్పారు. పూజ మాత్రం ‘నేను పిల్లలు నీతో కలిసి వస్తాం.. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే మేము కూడా ఉంటామని’ అనడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి చిన్న ఘర్షణ జరిగింది. దీంతో దివ్య గురువారం సాయంత్రం తన అమ్మవారు ఊరు భావనపాడుకు వెళుతున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తింటివారు చెబుతున్నారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తన సిబ్బంది కలిసి చలమయ్యపేట వెళ్లి విచారణ చేపట్టారు.

Updated Date - Jun 20 , 2026 | 12:32 AM