Share News

Ugadi: ఉగాది శోభ

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:25 AM

Ugadi జిల్లాలోని వివిధ మార్కెట్లు బుధవారం కొనుగోలుదారులతో కళకళలాడాయి.

 Ugadi: ఉగాది శోభ
పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో రద్దీ

- కళకళలాడిన మార్కెట్లు

- పూజా సామగ్రి కొనుగోలు చేసిన ప్రజలు

- ఏరువాకకు సిద్ధమవుతున్న రైతులు

నరసన్నపేట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ మార్కెట్లు బుధవారం కొనుగోలుదారులతో కళకళలాడాయి. గురువారం కొత్త అమావాస్య (ఉగాది) కావడంతో అవసరమైన పూజా సామగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు. ఉగాది పచ్చడి తయారు చేసేందుకు మామిడి కాయలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేపపువ్వులు, చెరుకు తదితర వస్తువులను కొనుగోలు చేశారు. ముఖ్యంగా రైతులు ఉగాది ఏరువాక (ఏరుపూత) కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏరువాకకు కావాల్సిన మునకల కర్ర, మోకులు, పలుపులు, పసుపు కొమ్ములు, చెరుకు, తట్ట తదితర వస్తువులను కొనుగోలు చేశారు. నాగళిని కడిగి, పసుపు రాసి, శుభ్రం చేసి మోకును కట్టి గురువారం ఏరుపూత నిర్వహించనున్నారు. ఉదయం 7.22 గంటలకు ఏరువాక, ఇతర పూజలు నిర్వహించేందుకు శుభగడియలని పండితులు చెబుతున్నారు. ఈరోజు పొలం పనులు ప్రారంభిస్తే ఆ ఏడాదంతా పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం.

ఆఫర్లు ప్రకటించిన వ్యాపారులు

ఉగాది నాడు కొత్తవస్తువు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఈ పర్వదినంలో పసుపు, బెల్లం, చింతపండుతోపాటు బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. గ్రాము బంగారం కోనుగోలుపై రూ.50 నుంచి 70 వరకు తగ్గించగా, కొందరు వ్యాపారులు బహుమతులు ప్రకటించారు. సెల్‌షాపులు, ఫర్నిచర్‌ షాపులు కూడా ఆఫర్లు ప్రకటించాయి.

Updated Date - Mar 19 , 2026 | 12:25 AM