ఉత్సాహంగా.. ఉగాది
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:29 AM
ugahi celebrations at srikakulam శ్రీ పరాభవ నామ సంవత్సరం.. ఉగాది పర్వదినం వేళ సంబరాలు అంబరాన్ని తాకాయి. గురువారం జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామాన ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు.. కలెక్టర్ అధికారులతోపాటు.. ప్రజాప్రతినిధుల సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది.
జిల్లావ్యాప్తంగా సంబరాలు
వాడవాడలా పంచాంగ శ్రవణాలు
సమష్టి కృషితో అభివృద్ధి : కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఆకట్టుకున్న అధికారులు, నాయకుల వస్త్రధారణ
అరసవల్లి/కోటబొమ్మాళి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): శ్రీ పరాభవ నామ సంవత్సరం.. ఉగాది పర్వదినం వేళ సంబరాలు అంబరాన్ని తాకాయి. గురువారం జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామాన ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు.. కలెక్టర్ అధికారులతోపాటు.. ప్రజాప్రతినిధుల సంప్రదాయ వస్త్రధారణతో తెలుగుదనం ఉట్టిపడింది. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు.. వేద పండితుల ఆశీర్వచనాలు.. వాడవాడలా పంచాంగ శ్రవణాలు.. షడ్రుచుల ఉగాది పచ్చడి స్వీకరణ తదితర సంప్రదాయాల మేళవింపుతో వేడుకలు నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త వాహనాలకు పూజలు చేయించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్, ఎమ్మెల్యే గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ ఏడాది ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ప్రత్యేకమని, అందరూ సానుకూల దృక్పథంతో కష్టసుఖాలను అధిగమించి జీవితంలో ముందడుగు వేయాలని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం శివశ్రీ నృత్యకళానికేతన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన, కోలాటం, ఏకపాత్రాభినయం, నృత్యాలు ఆహూతులను అలరించాయి. ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి పంచాంగ శ్రవణం గావించి, ఈ ఏడాది రాశి ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో లక్ష్మణమూర్తి, డీఈవో ఏ.రవిబాబు, ఉద్యానవన అధికారి వరప్రపసాద్, డీఐపీఆర్‌వో చెన్నకేశవరావు, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, పర్యాటక శాఖాధికారి పి.నారాయణరావు, దేవదాయశాఖ అధికారి ప్రసాదరావు పట్నాయక్, తహసీల్దార్ గణపతిరావు పాల్గొన్నారు.
కళాకారులకు పురస్కారాలు
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు సీఎం చంద్రబాబునాయుడు చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. ఆయా కళాకారులను సత్కరించి.. అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం మండలం రాగోలులోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డా.పొన్నాడ ఉదయబాబుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. సాంకేతిక అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ.. కొత్త వంగడాల రూపకల్పన, లాభసాటి వ్యవసాయానికి కృషి చేస్తున్నందుకుగాను ఉదయబాబుకు ఈ పురస్కారం దక్కింది.
కవిటి మండలం బి.గొనపపుట్టుగకు చెందిన పిరియా చలపతిరావు.. నాటక రంగంలో కళారత్న(హంస) పురస్కారాన్ని అందుకున్నారు.
నరసన్నపేట మండలం గుండువిల్లిపేటకు చెందిన చెంచు భాగవతం కళాకారుడు ఆవల జగన్నాథం, బాలసీమకు చెందిన ఆలయ వాస్తుశిల్పకళ ప్రావీణ్యుడు చామర్తి బాలభాస్కరన్ స్థపతికి పురస్కారాలు అందజేశారు. వారికి ప్రశంసాపత్రంతోపాటు రూ.50వేల పారితోషికాన్ని ఇచ్చారు.
హిరమండలం మండలంలోని మహాలక్ష్మీపురం కాలనీకి చెందిన అర్జంగి లింగమూర్తికి పద్యనాటక రంగంలో ప్రతిభకు గుర్తింపుగా పురస్కారాన్ని అందజేశారు.
సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగిద్దాం
ఆచారాలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలు చేసుకున్నారు. మంత్రి అచ్చెన్న దంపతులు ఆవులకు ప్రత్యేక పూజలు చేశారు. వాటికి ఉగాది ప్రసాదాన్ని తినిపించారు. గ్రామీణ సంస్కృతి, పశుసంపద పరిరక్షణే మన అసలైన సంపదని మంత్రి అచ్చెన్న తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్ పాల్గొన్నారు.