ఎయిర్‌పోర్టుతో ఉద్దానం మరింత అభివృద్ధి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:21 AM
ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే మరిన్ని ప్రాజెక్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఉద్దాన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కార్గో ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు.
మొదటవిడతగా 652 ఎకరాలు మాత్రమే సేకరణ
మట్టినమూనా పరీక్షలకు ప్రజలు సహకరించండి
భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్వరరావు
వజ్రపుకొత్తూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే మరిన్ని ప్రాజెక్టులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఉద్దాన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కార్గో ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సీతారామయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు కోసం మొదట విడతలో 652 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయనున్నట్లు చెప్పారు. ‘మందస మండలం బిడిమి, వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి, మెట్టూరు పంచాయతీల్లో ఈ భూమిని సేకరిస్తాం. ఇందులో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 519 ఎకరాలను మాత్రమే రైతులు నుంచి సేకరిస్తాం. రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్‌పూలింగ్ ద్వారా విలువైన భూమిని రైతులకు అందిస్తాం. ఈ ప్రాంతం ప్రజల ఉపాధి అవకాశాలపై కూడా పరిశీలన చేస్తాం. జిరాయితీ భూములతో పాటు డిపట్టాలకు కూడా పరిహారం చెల్లిస్తాం. అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది. రైతులు ఆందోళన చెందవద్దు. పరిహారం చెల్లింపులు పూర్తయిన తరువాతనే ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెడతాం. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు రైతుల నుంచి కమిటీని ఏర్పాటు చేస్తాం. కార్గోఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతాలకు కమిటీని తీసుకువెళ్తాం. మట్టి నమూనాలు, టోకో గ్రాపికల్ పరీక్షలు జరిపిన తరువాత, ఎయిర్‌పోర్టు అఽథారిటీ సంస్థ అనుమతులు ఇచ్చిన తరువాతనే భూ సేకరణపై ముందుకు వెళ్తాం. మట్టి నమూనాల సేకరణకు ప్రజలు సహకరించాలి. కొన్ని గ్రామాల రైతుల భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేమంటూ వినతపత్రాలు అందించారు. వారితో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం.’అని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి.శ్రావన్, వీఆర్వోలు పాల్గొన్నారు.