Share News

ఉద్దానం అంటే.. ఇకపై కేంద్రీయ విద్యాలయం

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:25 AM

Kendriya Vidyalaya classes begin ‘ఉద్దానం అంటే ఇప్పటివరకూ కిడ్నీవ్యాధులే గుర్తొచ్చేవి. ఇకపై పలాస కేంద్రీయ విద్యాలయం గుర్తొస్తుంద’ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. సోమవారం కలెక్టర్‌ స్పప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి కాశీబుగ్గ రైల్వే స్కూల్‌లో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం తరగతులను ఆమె ప్రారంభించారు.

ఉద్దానం అంటే.. ఇకపై కేంద్రీయ విద్యాలయం
పలాస కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

కాశీబుగ్గలో తరగతులు ప్రారంభం

కాశీబుగ్గ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘ఉద్దానం అంటే ఇప్పటివరకూ కిడ్నీవ్యాధులే గుర్తొచ్చేవి. ఇకపై పలాస కేంద్రీయ విద్యాలయం గుర్తొస్తుంద’ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. సోమవారం కలెక్టర్‌ స్పప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి కాశీబుగ్గ రైల్వే స్కూల్‌లో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం తరగతులను ఆమె ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రసంగాన్ని వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. ‘పలాస సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవ, కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి, ప్రతి ఒక్కరి కృషి ఫలితంగా పలాసకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం ఇక్కడ బాలవాటిక 1, 2, 3తోపాటు ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహిస్తాం. సిఫారసులకు తావులేకుండా పారదర్శకంగా అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధనతోపాటు భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయ’ని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా శాశ్వత భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. కాగా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గం నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా హాజరయ్యారు. విద్యార్థులతో కలెక్టర్‌, ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించారు. వారికి పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపి టీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరయాదవ్‌, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ సోయాబ్‌ ఆలామ్‌,పలాస కేంద్రీయ విద్యాలయం ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ మదీనామాల్లిక్‌, అడ్మిషన్‌ ఇన్‌చార్జ్‌ బాలమురళీకృష్ణ, తహసీల్దార్‌ కళ్యాణ్‌చక్రవర్తి, జనసేన క్లస్టర్‌ ఇన్‌చార్జి వంశీచౌదరి పాల్గొన్నారు.

శుభపరిణామం: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

‘ఓవైపు పవిత్రమైన చందనోత్సవం.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం.. ఇటువంటి మంచిరోజున పలాసలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం కావడం శుభపరిణామం’ అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సోమవారం వీడియో రూపంలో తన సందేశాన్ని వినిపించారు. ‘ఉద్దానం ప్రాంత ప్రజలకు కేంద్రీయ విద్యాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇది మార్గదర్శకంగా ఉంటుంది. ఈ పాఠశాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని కేంద్రమంత్రి తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 12:25 AM