ఆ 12 గంటలూ..
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:32 AM
Boy goes missing రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ గుండుపేట(ఎన్‌జీ పురం)లో గుండు సంతోష్, సునీత దంపతులకు చెందిన రెండేళ్ల బాలుడు మోహిత్ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. వీధిలో తోటిపిల్లలతో ఆడుకునేందుకు బయటకు వచ్చిన ఆ బాలుడు సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత ఇంటికి చేరలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
గుండుపేటలో రెండేళ్ల బాలుడు అదృశ్యం
ఆచూకీ కోసం రాత్రంతా జల్లెడ పట్టిన పోలీసులు
తోటలో ఉన్నట్టు గుర్తించి.. అప్పగించిన వైనం
ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు
రెండేళ్ల బాలుడు సాయంత్రం 6 నుంచి కనిపించలేదు. ఊరంతా వెదికినా ఫలితం లేదు. పోలీసులూ వచ్చి గాలించారు. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో రాత్రంగా జల్లెడ పట్టారు. ఉదయం పాదముద్రల ఆధారంగా ఓ తోటలో అనుసరించారు. 6 గంటల సమయంలో తుప్పల మధ్య బాలుడు కనిపించాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
రణస్థలం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ గుండుపేట(ఎన్‌జీ పురం)లో గుండు సంతోష్, సునీత దంపతులకు చెందిన రెండేళ్ల బాలుడు మోహిత్ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. వీధిలో తోటిపిల్లలతో ఆడుకునేందుకు బయటకు వచ్చిన ఆ బాలుడు సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత ఇంటికి చేరలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బాలుడి కోసం వెతికినా ఆచూకీ దొరకక పోవడంతో రాత్రి 10 గంటల సమయంలో జేఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డికి సమాచారం అందడంతో ఆయన వెంటనే స్పందించారు. నిరంతర పర్యవేక్షణతో ప్రత్యేక సిబ్బందిని పంపించారు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 70మంది పోలీసులు గ్రామంలో అనువనువునా గాలించారు. డ్రోన్లతోపాటు డాగ్‌స్వ్కాడ్‌ను సైతం రంగంలోకి దించారు. గ్రామానికి సమీపాన 20 ఎకరాల కొబ్బరితోటను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పట్టారు. అర్ధరాత్రి దాటుతున్నా చిన్నారి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. పోలీసులు నిరంతరాయంగా గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాలకు సమీప తోటలు బురదమయంగా మారగా.. ఓచోట పాదముద్రికల ఆనవాళ్లు లభించాయి. వాటిని వెతుక్కుంటూ వెళ్లగా శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఓ తోటలో తుప్పల మధ్య చిన్నారి నిద్ర లేచి, తప్పటడుగులు వేస్తూ కనిపించాడు. దీంతో పోలీసులు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకున్నారు. రాత్రంతా గాలించి చిన్నారి ఆచూకీ దొరకడంతో.. ఎస్‌ఐ వి.సత్యనారాయణ భావోద్వేగానికి గురై మోహిత్‌ను ఎత్తుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.