వడదెబ్బతో ఇద్దరి మృతి
ABN , Publish Date - May 28 , 2026 | 12:59 AM
జిల్లాలో బుధవారం వడ దెబ్బతో ఇద్దరు మృతి చెం దారు.
హరిపురం/సోంపేట, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం వడ దెబ్బతో ఇద్దరు మృతి చెం దారు. మందస మండలం బాలిగాం పంచాయతీ రంగనాథపురం గ్రామానికి చెందిన నడుపూరి కృష్ణా రావు(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఒంట్లో కాస్తా నలతగా ఉందని పనికి వెళ్లలేదు. మధ్యాహ్నం బహిర్భూమి కోసం సమీప పొలాల్లోకి వెళ్లాడు. తిరిగి వస్తూ ఇంటి సమీపంలో స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి భార్య, కుటుంబ సభ్యులు అటువెళ్లగా పొలంలో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ఇంటికి తెచ్చి సపర్యలు చేశారు. గ్రామానికి చెందిన ఓ వైద్యుడు పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. కృష్ణారావు మృతికి వడదెబ్బే కారణమని గ్రామస్థులు తెలిపారు. మృతుని భార్య రేఖకుమారి కన్నీరుమున్నీరై విలపిస్తుండటంతో అక్కడి వారందరికీ కళ్లు చమర్చాయి. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- సోంపేట మండలం పలాసపురం గ్రామానికి చెందిన సింహాచలం పాణిగ్రాహీ (68) వడదెబ్బతో మృతిచెందినట్లు భార్య శోభ, గ్రామస్థులు తెలిపారు. ఆరుబయట స్నానం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. సింహాచలంది నిరుపేద కుటుంబం. భార్య టైలరింగ్ చేసుకుంటూ బతుకుతోంది. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామపెద్దలు కోరారు.