మరో ఇద్దరు అరెస్టు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:36 AM
Chintada's bail petition adjourned వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంలో బూర్జ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌తోపాటు మరో 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మహిళా ఎస్‌ఐపై దాడి ఘటనలో మిగిలిన ఇద్దరూ పోలీసులకు లొంగుబాటు
చింతాడ బెయిల్ పిటిషన్ వాయిదా
ఆమదాలవలస స్టేషన్‌లో విచారణ
ఆమదాలవలస, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంలో బూర్జ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌తోపాటు మరో 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పోలీసులు ప్రధాన నిందితుడు చింతాడ రవికుమార్‌తోపాటు మరో 24 మందిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో పరారీలో ఉన్న నానుపాత్రుని సురేష్, గురుగుబిల్లి భాస్కరరావు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి ఆమదాలవలస జూనియర్స్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఆ ఇద్దరికీ రూ.10వేల పూచీకత్తులతో న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో చింతాడతోపాటు మిగిలిన నిందితుల బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేశారు. వాదనలు విన్న న్యాయాధికారి బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 17నాటికి వాయిదా వేశారు.
చింతాడను విచారించిన పోలీసులు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన చింతాడ రవికుమార్‌ను ఒక రోజు కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. మొత్తం 14 మందిని విచారించాల్సి ఉండగా 13 మందిని శ్రీకాకుళం మండలం తండేంవలస వద్ద ఉన్న పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. ప్రధాన నిందితుడు చింతాడను మాత్రం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విచారణలో మహిళా ఎస్‌ఐపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారా? ముందస్తు ప్రణాళికతో ఇటువంటి చర్యకు పాల్పడ్డారా? అని తదితర ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ఎటువంటి దాడి చేయలేదని.. అనారోగ్యంతో ఉన్న ఎస్‌ఐను జనం మధ్య నుంచి పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించామని రవికుమార్ తెలిపినట్టు సమాచారం.
వైసీపీ జడ్పీటీసీ.. మరో నలుగురిపై కేసు నమోదు
జిల్లాలో సంచలనం సృష్టించిన బీమా కంపెనీలకు కోట్ల రూపాయల టోకరా ఘటనలో ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆమదాలవలస వైసీపీ జడ్పీటీసీ బెండి గోవిందరావుతో పాటు బెండి గున్నయ్య, బాడాన అప్పారావు, పొన్నాడ రాము, పవిత్రపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. జడ్పీటీసీ గోవిందరావు మరణానికి దగ్గరలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల పేరిట నకిలీ ధ్రువపత్రాలతో బీమా చేయించి రూ.కోట్లు స్వాహా చేసినట్లు గతంలో జిల్లా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విచారణను స్థానిక పోలీసులు జాప్యం చేయడంతో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పోలీస్ అధికారిని వీఆర్‌కు పంపించారు. అనంతరం సమగ్ర విచారణ జరపాలని ఆమదాలవలస పోలీసులను ఆదేశించారు. బీమా కంపెనీల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. జడ్పీటీసీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.