వేటకు వెళ్లి..
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:08 AM
Two fishermen die రోజూ మాదిరి సముద్రంలో వేటకు వెళ్లిన.. ఆ ఇద్దరు మత్స్యకారులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. బోటు బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. అస్వస్థతకు గురై మరొకరు కుప్పకూలిపోయారు. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు.. కుటుంబ సభ్యులు, మత్స్యకారుల్లో విషాదాన్ని నింపాయి.
వేర్వేరు చోట్ల ఇద్దరు మత్స్యకారుల మృతి
బోటు బోల్తాపడి ఒకరు.. అస్వస్థతకు గురై మరొకరు
దిబ్బల మరువాడ, నువ్వలరేవులో విషాదం
సంతబొమ్మాళి/ వజ్రపుకొత్తూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రోజూ మాదిరి సముద్రంలో వేటకు వెళ్లిన.. ఆ ఇద్దరు మత్స్యకారులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. బోటు బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. అస్వస్థతకు గురై మరొకరు కుప్పకూలిపోయారు. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు.. కుటుంబ సభ్యులు, మత్స్యకారుల్లో విషాదాన్ని నింపాయి. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ దిబ్బల మరువాడకు చెందిన బైపల్లి రామారావు(65).. ఆదివారం తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపలవేటకు వెళ్లాడు. తిరిగొస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ బోటు బోల్తాపడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోదించారు. రామారావుకి భార్య సత్యవతితోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు బెంగళూరులో వలస కూలీగా పనిచేస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని కోటబొమ్మాళి ఏఎంసీ డైరెక్టర్ సూరాడ ధనరాజ్, జిల్లా తెలుగు యువత కార్యదర్శి సూరాడ దాసురాజు పరామర్శించారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మత్స్యకారులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
అలాగే వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు సముద్ర తీరంలో బెహారా భీమా (61) అనే మత్స్యకారుడు మృతిచెందారు. తీరంలో పెద్ద వల వేయడంతో దాని తాడు లాగడానికి తోటి మత్స్యకారులతో భీమా ఆదివారం ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. తోటి మత్స్యకారులు సపర్యలు చేస్తుండగా మృతిచెందారు. ఎస్‌ఐ నిహార్ ఆధ్వర్యంలో పోలీసులు నువ్వలరేవు గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేయగా.. భీమా అస్వస్థతోనే మృతిచెందినట్టు గ్రామస్థులు చెప్పారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.