Share News

గంజాయితో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:39 AM

ఎం.తోటూరు జంక్షన్‌, రైల్వే క్రాసింగ్‌ ఎల్‌సీ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నంనాయుడు, రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.

గంజాయితో ఇద్దరి అరెస్టు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ఎం.తోటూరు జంక్షన్‌, రైల్వే క్రాసింగ్‌ ఎల్‌సీ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నంనాయుడు, రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్‌ గంజాయి తాగేందుకు అలవాటు పడి, వారు పనిచేసే అచ్యుతాపురంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎక్కువ రేటుకు అమ్మి ఎక్కువ సంపాదించవచ్చని నిర్ణయించున్నారు. ఒడిశా రాష్ట్రం బరంపురంలో గంజాయి వ్యాపారం చేసే నీలాంచల్‌ అనే వ్యక్తి వద్ద 2.100 కిలోలు కొనుగోలు చేశారు. గంజాయిని అచ్యుతాపురం తీసుకువెళ్లి అక్కడ విక్రయించేందుకు వెళ్తుండగా ఎం.తోటూరు ఎల్‌సీ గేటు దగ్గర పోలీసులు వారిద్దరినీ పట్టుకున్నారు. నిందితుల వద్ద రెండు సెల్‌ ఫోన్‌లు, బరువును తూచే చిన్న యంత్రం స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించారు.

ముగ్గురిపై కేసు నమోదు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ సిలిండర్‌ విషయమై పట్టణంలోని ఎస్‌వీఎస్‌బీ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద శుక్రవారం జరిగిన వివాదంలో మన్యాల విజ్ఞేసు, అతని ఇద్దరు కుమారులపై శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ జనార్దనరావు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులు గ్యాస్‌ ఏజెన్సీ యజమాని వజ్రపు వెంకటేశ్వరరావుతో గొడవ పడి చేతులతో కొట్టినట్లు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

నలుగురు పేకాటరాయుళ్లపై..

ఆమదాలవలస, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): వంజంగి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సీపాన కాంతారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం గ్రామ సమీపంలో గెడ్డకొట్టపై పేకాట ఆడుతున్నట్టు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.10,020 సీజ్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:39 AM