Share News

తాబేళ్లు.. విలవిల

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:53 PM

Turtles die తీర ప్రాంతంలో తరచూ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రణస్థలం మండలం దోనిపేట తీరంలో అధికంగా సముద్ర తాబేళ్ల కళేబరాలు బయటపడ్డాయి. వజ్రపుకొత్తూరు తీరప్రాంతంలోనూ కొన్నిరోజుల కిందట సముద్రం ఒడ్డుకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకువచ్చాయి.

తాబేళ్లు.. విలవిల

  • వలల ప్రభావంతో వందల సంఖ్యలో మృత్యువాత

  • నిబంధనలకు విరుద్ధంగా చేపల వేటే కారణం

  • రణస్థలం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతంలో తరచూ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రణస్థలం మండలం దోనిపేట తీరంలో అధికంగా సముద్ర తాబేళ్ల కళేబరాలు బయటపడ్డాయి. వజ్రపుకొత్తూరు తీరప్రాంతంలోనూ కొన్నిరోజుల కిందట సముద్రం ఒడ్డుకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకువచ్చాయి. వాస్తవానికి ఈ కాలంలో తీరంలో తాబేళ్లు మృతి చెందడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది మాత్రం అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా సముద్ర జలాల అడుగున తాబేళ్లు ఉంటాయి. కానీ ప్రతి 40 నిమిషాలకు ఒకసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలంపైకి వస్తాయి. అటువంటి సమయంలోనే వలలు, బోట్లు తగిలి.. విలవిల్లాడి మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చేపలవేట తాబేళ్ల పాలిట శాపంగా మారుతోంది.

  • తాబేళ్ల ఉత్పత్తికి అనువైన ప్రాంతం..

  • జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో తీర ప్రాంతం ఉంది. విశాలమైన ప్రదేశం, ఎత్తయిన ఇసుక తెన్నెలు ఉంటాయి. ఒడిశా తరువాత తాబేళ్ల సంతతికి మన తీరం అనువైన ప్రాంతం. అందుకే తీరంలోని చాలా ప్రాంతాలకు సముద్ర జలాల అడుగు భాగంలో ఉండే తాబేళ్లు వస్తుంటాయి. ఏటా నవంబరు నుంచి మార్చి వరకూ రాత్రివేళల్లో తీరం వైపు వస్తుంటాయి. తీరానికి సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ఇసుక దిబ్బల్లో బొరియలు చేసి గుడ్లు పెడుతుంటాయి. తాబేళ్లతో మత్స్యసంపదకు చాలా మేలు జరుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్‌ పెంచడంతో పాటు మత్స్య సంపదను వృద్ధిచేయడంలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. చేప గుడ్లు తినే జెల్లి ఫిష్‌ జాతిని నియంత్రిస్తాయి. చేపల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడతాయి. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రంపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధికి మేలు చేస్తాయి. కానీ మన జిల్లాలో తాబేళ్లకు ప్రాణహాని కలుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక మత్స్యకారులు ఏటా వందలాది తాబేళ్ల కళేబరాలను కప్పిపెడుతుండడం విచారకరం.

  • ఆ వలలతో వేట.. ప్రమాదమే

  • తీరానికి సమీపం నుంచే చేపలు వేటాడే మెక్‌నైజ్డ్‌ బోట్లు, నిషేధిత వలలు తాబేళ్ల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. పెద్ద ఇంజన్‌ బోట్లతో తీరానికి 8 కిలోమీటర్ల తరువాతే వేట సాగించాలన్న నిబంధన ఉంది. కానీ చాలామంది ఈ నిబంధనను పాటించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో ఉపరితలానికి వస్తున్న తాబేళ్లకు ఇంజన్‌ తగిలి మృత్యువాత చెందుతున్నాయి. నదులు, ఏరుల నుంచి సముద్రంలో కలుస్తున్న నీరు కూడా కలుషితం అవుతోంది. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున తాబేళ్లు మరణిస్తున్నాయి.

  • సముద్రంలో చేపలవేట సమయంలో కోనాగిల్‌ నెట్‌, అటక, టేకు వలలను మత్స్యకారులు ఉపయోగిస్తుండడంతో వాటిని తట్టుకోలేని తాబేళ్లు మృతి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. తాబేళ్లకు హాని కలుగకుండా మత్స్యకారులు వలలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నైకి చెందిన ట్రీ సంస్థ హెచ్చరికలతో.. తీరంలో తాబేళ్ల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినచట్టాలను అమలు చేస్తోంది. తాబేళ్లు సైతం వన్యప్రాణుల కిందకు వస్తాయి. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972 ప్రకారం తాబేళ్లను చంపడం నేరం. వాటి గుడ్లను సైతం తినడం, నాశనం చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అందుకే ఈ చట్టాన్ని అనుసరించి తీరంలో తాబేళ్ల సంరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించనుంది.

Updated Date - Feb 04 , 2026 | 11:53 PM