ఎముకల గూడుగా మారి...
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:11 AM
A dead body hanging from a tree ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కారణమేంటో తెలియదు. కానీ దాదాపు అస్థిపంజరంగా మారిన స్థితిలో కనిపించడం కలకలం రేపింది.
- చెట్టుకు వేలాడుతున్న మృతదేహం
- తోటాడ ప్రాంతంలో కలకలం
- మరణించి రెండు నెలలైనట్టు అనుమానం
ఆమదాలవలస, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కారణమేంటో తెలియదు. కానీ దాదాపు అస్థిపంజరంగా మారిన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని తోటాడ సమీపంలో గల మామిడి తోటలోని ఒక చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతుండడాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు ఆ ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. సుమారు 45 నుంచి 60 రోజుల క్రితం ఆ వ్యక్తి ప్లాస్టిక్ తాడులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి... దాదాపుగా ఎముకల గూడు మాత్రమే మిగిలి ఉంది. మృతదేహానికి సమీపంలో ఆమదాలవలసలోని ఓ మద్యం షాపులో జనవరి నెలలో కొనుగోలు చేసిన మద్యం సీసా, చెప్పులు, ఓ చిన్న బ్యాగ్ ఉన్నాయి. బ్యాగ్‌లో పంచెలు, షర్టులతో పాటు జనవరి 31న శ్రీకాకుళంలోని ఓ సినిమా హాల్‌లో తీసిన సినిమా టిక్కెట్ ఉంది. మృతుడికి బట్టతల ఉన్నట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. గత రెండు నెలల్లో జిల్లాలో గానీ... ఇతర జిల్లాల్లో గానీ అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే ఆమదాలవలస పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.