Share News

క్షయ.. నిర్లక్ష్యం చేస్తే ముప్పు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:11 AM

332 high-risk villages identified జిల్లాలో క్షయ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. క్షయ బాధితులు తుమ్మినా, దగ్గినా, ఆ తుంపర్లు పక్కవారిపై పడితే.. అందులోని సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం. వ్యాధి సకాలంలో గుర్తిస్తే నివారణ సులభం.

క్షయ.. నిర్లక్ష్యం చేస్తే ముప్పు
టెక్కలిలో టీబీ ల్యాబ్‌లో క్షయ పరీక్షలు చేస్తున్న దృశ్యం

  • జిల్లాలో విస్తరిస్తున్న వ్యాధి

  • 332 హైరిస్క్‌ గ్రామాలు గుర్తింపు

  • అప్రమత్తతతోనే నివారణ సాధ్యం

  • నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం

  • టెక్కలి రూరల్‌/ నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్షయ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. క్షయ బాధితులు తుమ్మినా, దగ్గినా, ఆ తుంపర్లు పక్కవారిపై పడితే.. అందులోని సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం. వ్యాధి సకాలంలో గుర్తిస్తే నివారణ సులభం. జిల్లాలో సుమారు 3 వేలమందికిపైగా బాధితులు ఉన్నట్టు ఐఎంఏ లెక్కల ద్వారా తెలుస్తోంది. క్షయ వ్యాధి బారినపడి ఏటా 50 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్షయ నిర్మూలనపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునాతన చికిత్సను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం నుంచి ప్రధానమంత్రి టీబీ ముక్తాభారత్‌ కార్యక్రమం ద్వారా హైరిస్క్‌ గ్రామాలను గుర్తించి.. వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బంది సన్నద్ధమవుతున్నారు.

  • కేసులు ఇలా..

  • జిల్లాలో క్షయ వ్యాధి కారణంగా పింఛన్ల కోసం 3,342 మంది దరఖాస్తు చేయగా.. 2,554 మందికి పింఛన్లు అందజేస్తున్నారు. గతేడాది 72,462 మందికి క్షయ పరీక్షలు చేయగా.. 3,071 మందికి నిర్ధారణ అయింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 13,842 మందికి పరీక్షలు నిర్వహించగా.. 506 మందికి నిర్ధారణ అయింది. గతేడాది టీబీ కేసుల్లో ఎండీఆర్‌ కేసులు 81, టీబీ హెచ్‌ఐవీ కేసులు 44 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఎండీఆర్‌ కేసులు 12, టీబీహెచ్‌ఐవీ కేసులను 12 గుర్తించారు.

  • 332 హైరిస్క్‌ గ్రామాలు గుర్తింపు..

  • జిల్లాలో ప్రస్తుతం 332 హైరిస్క్‌ గ్రామాలు గుర్తించారు. ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి ముక్తాభారత్‌ ద్వారా సంచార వాహనాలతో గ్రామాల్లో కెల్ల పరీక్షలు చేస్తారు. ఎక్స్‌రేలు తీస్తారు. తొలివిడతలో సుమారు 8 లక్షల మందికి పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో క్షయవ్యాధి ఉన్నవారితోపాటు.. వారి కుటుంబ సభ్యులను తనిఖీ చేస్తారు. జైళ్లు, వృద్ధాశ్రమాల్లో కూడా తనిఖీ చేస్తారు. దీంతోపాటు అధికంగా బీపీ, సుగర్‌ వ్యాధులు ఉన్నవారికి క్షయవ్యాధి తనిఖీలు చేయనున్నట్టు వైద్యసిబ్బంది తెలిపారు.

  • లక్షణాలు

  • రెండు వారాలకు మించి దగ్గు, జర్వం ఉంటుంది. మూడు నెలల వ్యవధిలో 5 నుంచి 10శాతం బరువు తగ్గుతారు. దగ్గినప్పుడు రక్తం పడడం, చాతీ ఎక్స్‌రేలో అనుమానాస్పద మరకలు ఉంటాయి. మెడ, గొంతు, చెంప, చెవికింద, చర్మంలోపల గడ్డలు కనిపిస్తాయి. మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఒక్క రోజు దగ్గు వచ్చినా కెల్ల పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో మందులు వాడి.. మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధి తగ్గుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

  • బాధితులకు భరోసా..

  • క్షయ బాధితులకు జిల్లా టీబీ నివారణశాఖ ఆధ్వర్యంలో ఖరీదైన మందులను ప్రతి నెలా అందజేస్తున్నారు. పౌష్టికాహారం కోసం ప్రభుత్వం రూ.వెయ్యి వారి ఖాతాల్లో జమచేస్తోంది. బాధితుడిని ప్రైవేటు డాక్టర్లు గుర్తించి సమాచారం మందిస్తే సదరు వైద్యునికి ప్రోత్సాహకంగా రూ.500 అందజేస్తోంది. చికిత్స పూర్తయ్యాక మరో రూ.500, డాట్‌ పద్ధతిలో రోగితో మందులు వేయించినందుకు ఆరోగ్య కార్యకర్తలకు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు.

  • జిల్లాలో ట్రూనాట్‌ పరీక్షా కేంద్రాలు : 41

  • టీబీ కేంద్రాలు 9

  • సీబీనాట్‌ కేంద్రాలు 02

  • కెల్ల పరీక్షా కేంద్రాలు : 97

  • 100 రోజులు ప్రొగ్రాం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి ముక్తాభారత్‌ కింద వ్యాధి నివారణకు 100 రోజులు ప్రోగ్రాం అమలు చేస్తున్నాం. 8 లక్షల మందికి పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇంటింటా సర్వేలతో క్షయ రోగులను గుర్తించి.. అనుమానిత కేసులకు కెల్ల పరీక్షలు చేపడుతున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ,జిల్లా ఆసుపత్రుల్లో పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. మందులను ఉచితంగా అందజేస్తున్నాం.

    - డా.తాడేల శ్రీకాంత్‌, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి, శ్రీకాకుళం

  • ప్రజల సహకారం అవసరం

  • క్షయ నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. బాధితులకు పౌష్టికాహరం అందివ్వటానికి దాతలు ముందుకు రావాలి. ప్రస్తుతం క్షయ వ్యాధి అదుపులో ఉంది.

    - ప్రగాడ శ్రీనివాసరావు, జిల్లా టీబీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌

Updated Date - Mar 24 , 2026 | 12:11 AM