కాకి తెచ్చిన కష్టం
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:33 AM
బూర్జలోని పెద్దకోమటివీధిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి.
బూర్జ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బూర్జలోని పెద్దకోమటివీధిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల కథనం మేరకు.. బల్ల చాకలి ఇంటికి ఆనుకొని ఉన్న త్రినాథ స్వామి ఆలయంలోని దీపాన్ని కాకి తీసుకొచ్చి ఆ ఇంటిపై వెసింది. దీంతో ఆ ఇంట్లో మంటలు చెలరేగి.... ఒక్కసారిగా పొరుగున ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ఆ ఇంటితోపాటు తిరుమరెడ్డి శివశంకరరావు, అల్లు ముఖలింగం, కుమారస్వామి, సూర్యారావు, లక్ష్మీనారాయణలకు చెందిన ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పాలకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.