బీటలువారి.. పెచ్చులూడి
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:28 AM
Tribal primary schools .. problems గిరిజన ప్రాథమిక పాఠశాలలకు(జీపీఎస్) సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా పాఠశాలలు శిథిలావస్థలకు చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
శిథిలావస్థలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు
సమస్యలు ఒడిలో విద్యార్ధులు..!
భవనాలు, సౌకర్యాలు లేక ఇబ్బందులు
టెక్కలి రూరల్, మార్చి 3(ఆంధ్రజ్యోతి):
టెక్కలి మండల చిన్నాకేదారిలోని ప్రభుత్వ పాఠశాలలో 14 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. గత 30 ఏళ్ల కిందట నిర్మించిన ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని బీటలువారింది. విద్యాశాఖ అధికారుల సూచన మేరకు ఈ భవనాన్ని ఖాళీ చేసి.. అర్థాంతరంగా నిర్మించి వదిలేసిన అంగన్‌వాడీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మట్టి నేలపైనే చదువులు సాగిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఉపాధ్యాయుడు దండాశి తెలిపారు.
మెళియాపుట్టి మండలం పరశురాంపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వైసీపీ పాలనలో అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం పాత సచివాలయ భవనంలో బోధన సాగిస్తున్నారు.
గిరిజన ప్రాథమిక పాఠశాలలకు(జీపీఎస్) సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా పాఠశాలలు శిథిలావస్థలకు చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 100 పాఠశాలలు ఉండగా, సుమారు 1,558 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది మంది విద్యార్థులు కన్నా తక్కువ ఉన్న పాఠశాలలను గత వైసీపీ ప్రభుత్వం మూసేసింది. సమీప పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయిలో చదువుకునే అవకాశం లేక డ్రాపౌట్స్ పెరుగుతున్నారు. కొంతమంది సమీప పాఠశాలలకు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. కాగా.. ఆ పాఠశాలల్లో కూడా మౌలిక సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. 30 ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికంగా జీపీఎస్ పాఠశాలలకు నిధులు మంజూరు చేసి భవనాలు నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ పాఠశాలలకు కనీసం మరమ్మతులకు కూడా నిధులు కేటాయించలేదు. దీంతో చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో గచ్చులు పాడైపోవడంతో టార్పాలిన్లు, చాపలు తెచ్చి కూర్చొంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో పైన పెచ్చులూడిపోవడంతో బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.