Share News

ఏమైంది తల్లీ!

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:02 AM

Tribal girl dies under suspicious circumstances పాతహిరమండలం ప్రాంతానికి చెందిన తోట జయంతి(16) అనే గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది.

ఏమైంది తల్లీ!
జయంతి (ఫైల్‌).. విషాదంలో కుటుంబ సభ్యులు

  • వెంటతీసుకెళ్లాడు.. రెండ్రోజులకే మృత్యువాత

  • అనుమానాస్పదస్థితిలో గిరిజన బాలిక మృతి

  • మృతదేహంపై గాయాలు.. పోలీసులకు ఫిర్యాదు

  • ఒక్కగానొక్క కూతురు. తమకెంత కష్టమైనా చదివిస్తున్నారు. నమ్మిన వ్యక్తి చెబితే ఇంటర్‌లో చేర్పించారు. ఇటీవలే ఆ బాలిక ఇంటికి వచ్చింది. ఆదివారం ఆ వ్యక్తి వచ్చి ట్యూషన్‌ పెట్టించాలంటే వెంట పంపించారు. బాగా చదువుకో బిడ్డా అని చెప్పారు. రెండు రోజులకు ఆ వ్యక్తి నుంచి పిడుగులాంటి వార్త విని హతాశులయ్యారు. విగతజీవిగా వచ్చిన కన్నబిడ్డను చూసి కుప్పకూలిపోయారు. ఒంటిపై గాయాలు ఉన్నాయని, తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  • హిరమండలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పాతహిరమండలం ప్రాంతానికి చెందిన తోట జయంతి(16) అనే గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. జయంతి తల్లిదండ్రులు తోట శ్రీను, రోధి గ్రామాల్లో సర్కస్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక్కతే కూతురు. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ ఇంటికి వస్తూ పోతుండేవాడు. వీరి జీవననానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేస్తూండేవాడు. ఈ నేపథ్యంలో జయంతి టెన్త్‌ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్‌ ఎస్‌.కోటలో చదివిస్తానని, ఇందుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని తల్లిదండ్రుల వద్ద నమ్మబలికాడు. దీంతో వెంకట్రావుపై నమ్మకంతో ఎస్‌.కోటలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంచి ఇంటర్‌లో చేర్పించారు. ఇటీవల పరీక్షలు పూర్తయిన తర్వాత జయంతి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రెండు రోజుల కిందట తాను శ్రీకాకుళం వచ్చానని, జయంతికి ట్యూషన్‌ చెప్పించాలని వెంకట్రావు చెప్పడంతో.. ఆదివారం ఆమె తండ్రి శ్రీను గార మండలం శ్రీకూర్మం తీసుకువచ్చి జయంతిని అప్పగించాడు.

  • రెండు రోజుల తర్వాత..

  • రెండు రోజుల తరువాత మంగళవారం ఉదయం వెంకట్రావు ఫోన్‌ చేసి జయంతికి సీరియస్‌గా ఉందని, తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తే అవ్వడం లేదంటూ బాలిక బంధువులకు చెప్పాడు. మధ్యాహ్నం అపస్మారక స్థితిలో ఉన్న జయంతిని కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అప్పటికే బాలిక నోరు, ముక్కు నుంచి రక్తం కారడంతో మృతి చెందిందని అనుకున్నారు. కళ్లు తిరుగుతున్నాయంటూ ఇంటికి తీసుకువెళ్లాలని జయంతి చెప్పిందని, అందుకే హాస్టల్‌ నుంచి తీసుకు వచ్చానని వెంకట్రావు చెప్పాడు. కుటుంబ సభ్యులు మృతదేహంపై పడి రోదిస్తున్న సమయంలో నాడి కొట్టుకుంటున్నట్టు గుర్తించారు. దీంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవ్వగా.. వెంకట్రావు వద్దని తన కారులో రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతదేహంపై గాయాలున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హిరమండలం ఎస్‌ఐ హేమంత్‌ కల్యాణ్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. జయంతి మృతి విషయం బయటకు చెప్పొద్దని, ఒక వేళ చెప్పినా తనకు పోయేదేమీలేదని, డబ్బులిచ్చి బయటకు వచ్చేస్తానని వెంకట్రావు తమను హెచ్చరించినట్టు చెప్పారు. ఎవరికీ చెప్పకుండా దహన సంస్కారాలు కూడా చేయాలని చెప్పాడన్నారు. తమ బిడ్డను హాస్టల్‌కు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడని వారు ఆరోపించారు. ఇతనిపై తమకు అనుమానం ఉందని చెబుతున్నారు. కాగా తమ పిల్లలను పంపిస్తే ఎస్‌.కోటలో హాస్టల్‌లో పెట్టి చదివిస్తామని చెప్పినా.. వెంకట్రావుపై నమ్మకం కుదరక పంపించలేదని కొంతమంది చెబుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:02 AM