Share News

ఆదివాసీ సంబరం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:28 PM

సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివారం పలాస రైల్వే మైదానంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

   ఆదివాసీ సంబరం
200 మంది కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన

- పలాసలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

- గిరిజనుల భారీ ర్యాలీ

- ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

- గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే శిరీష

- పర్యాటకరంగం అభివృద్ధికి ప్రణాళికలు: కలెక్టర్‌

పలాస/కాశీబుగ్గ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివారం పలాస రైల్వే మైదానంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన గిరిజనలతో సభాప్రాంగణం కళకళలాడింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రెండు కిలోమీటర్ల పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యాలు, మేమే గుర్రం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదిక వద్ద 200 మంది థింసా కళాకారులతో సామూహిక ప్రదర్శన అలరించింది. వీరు ఇటీవల భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. గిరిజాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని, ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. 50 ఏళ్లకే గిరిజనులకు పింఛను సౌకర్యం కల్పించిన ఘనత కూటమికే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో గిరిజనుల దశమార్చే విధంగా అభివృద్ధి జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పలాస, మందస, మెళియాపుట్టి మండలాల్లో గిరిజన విద్యార్థుల కోసం మల్టీస్పోర్ట్‌ కాంప్లెక్స్‌లు, పర్యాటక రంగంగా టెక్కింగ్‌ మార్గాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రకృతి వనరులు అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 20 మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉండగా, 291 గ్రామాలకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న వైనాన్ని గుర్తించి రూ.179 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మించినట్లు తెలిపారు. గిరిజనుల గౌరవానికి ప్రతీకగా భోగాపురం విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందని గుర్తుచేశారు. జిల్లాలో 90వేల మంది గిరిజనులు నివాసం ఉండగా, వారికి కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల పది పరీక్ష ఫలితాల్లో 94.77 శాతం మంది ఉతీర్ణత సాధించడం పట్ల వారికి అభినందించారు. గిరిజన గ్రామాల్లో సికిల్‌సెల్‌, ఎనిమియా, తలసేమియా వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అటవీహక్కుల చట్టంకింద 163 ఎకరాల భూమిని వారికి పంపిణీ చేశామన్నారు. అమోఘం పేరుతో వీడీవీకేలు, డోక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సహిస్తున్నామన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించి ఆదాయం పెంచేందుకు తగు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ ఏపీవో చిన్నబాబు, ఆర్డీవో ఆర్‌.అప్పలరాజు, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డీడీ అన్నాదొర, గిరిజన సంక్షేమ ఈఈ రమాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు, ఎంపీడీవో వసంతకుమార్‌, గిరిజన జేఏసీ అధ్యక్షుడు సవర రాంబాబు, సవర జగన్నాయకులు, ఈశ్వరరావు, ఉమాపతి, రామారావు, వాబ యోగి పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:28 PM