ఖజానా శాఖలో కలకలం
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:23 AM
Key official accused of passing false bills జిల్లా ఖజానాశాఖ కార్యాలయంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కీలక అధికారిపై కిందిస్థాయి అధికారులు, సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ డం.. అందుకు సంబంధించి ఆధారాలను సైతం పంపడం చర్చనీయాంశమైంది.
తప్పుడు బిల్లులు పాస్ చేశారంటూ కీలక అధికారిపై ఆరోపణలు
ఆధారాలతో ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్‌కు ఏటీవో ఫిర్యాదు
తాజాగా శ్రీకాకుళం ఎమ్మెల్యేకు సిబ్బంది వినతిపత్రం అందజేత
మొన్న వర్గాలవారీగా పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్
స్పందించని ఉన్నతాధికారులు
శ్రీకాకుళం, మార్చి 28(ఆంధ్రజ్యోతి):
జిల్లా ఖజానాశాఖ కార్యాలయంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కీలక అధికారిపై కిందిస్థాయి అధికారులు, సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ డం.. అందుకు సంబంధించి ఆధారాలను సైతం పంపడం చర్చనీయాంశమైంది. అటు బిల్లులు పాస్ నుంచి.. ఇటు హాజరు నమోదు ప్రక్రియ వ్యవహారంలో కొన్నాళ్లుగా అధికారులకు, సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. దీనిపైనా పోలీసులతోపాటు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందడంతో.. కీలక అధికారికి మెమోతోపాటు 15 మంది సిబ్బందికి నోటీసులు జారీ అయ్యాయి.
.........
జిల్లా ఖజానా శాఖ కార్యాలయం.. అవినీతి ఆరోపణలు, వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇటీవల జిల్లా ఖజానా శాఖపై, ఓ కీలక అధికారి తీరుపై ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బిల్లుల పాస్ వ్యవహారంపై సహాయ ఖజానా అధికారి(ఏటీవో) ఎన్‌వీ రమణారెడ్డి.. ఇటీవల రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌కు కొన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఏటీవో ఈ ఏడాది జనవరి 31న సెలవు పెట్టారు. అంతకుముందు కొన్ని బిల్లులను పరిశీలించి తొమ్మిది బిల్లులకు అభ్యంతరాలు వ్యక్తం చేసి రిజెక్ట్ చేశారు. అయితే ఏటీవో సెలవు పెట్టిన రోజున రిజెక్ట్ చేసిన బిల్లులను ఓ కీలక అధికారి ఆమోదించేసి ఫైల్ క్లియర్ చేశారు. ఈ పరిణామం వివాదానికి దారితీసింది. ఇదే విషయాన్ని ఖజానాశాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు ఆధారాలతో సహా ఏటీవో ఫిర్యాదు చేశారు. ఖజానా శాఖలో సంబంధిత కీలక అధికారి సొంత లాగిన్‌లో సుమారు 200 బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, వాటిని క్లియర్ చేయకుండా.. తాను సెలవులో ఉన్నప్పుడు.. అదీ కొన్ని అభ్యంతరాలతో తిరస్కరించిన బిల్లులను ఏదో ఆశించి చేశారని ఏటీవో ఆరోపించారు. ట్రెజరీ పరువు పోయిందని దీనిపై విచారణ చేయాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పరోక్షంగా ట్రెజరీలో అంతర్యుద్ధం జరుగుతోంది.
మొన్న పోలీసుస్టేషన్ వరకు...
జిల్లా ఖజానాశాఖ సిబ్బందిలో కొంతమందిపై ఇటీవల వన్‌టౌన్ పోలీసులకు జిల్లా ట్రెజరీలోని ఓ అధికారి ఫిర్యాదు చేశారు. అయితే.. అంతకుముందు కొంతమంది సిబ్బందికి సబ్జెక్ట్‌లు చూసేవారికి.. ఇతర అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం వల్ల సిబ్బందికి.. ఆ అధికారికి మధ్య కోల్డ్‌వార్ జరిగింది. చాలామంది సీట్లు మార్చాలని కోరడం... ఇటీవల శ్రీకాకుళం సబ్‌ట్రెజరీలో ఇద్దరు ఏసీబీకి చిక్కడం.. ఆ వివాదాస్పద స్థానంలో సీనియర్ అకౌంటెంట్‌ను నియమించాల్సి ఉన్నా.. ఇతర ప్రాంతంలో ఉన్న ఉద్యోగిని నియమించడం.. ఇదంతా అంతర్గత వివాదంగా మారింది. దీనిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. సీట్లు మార్పు విషయమై... కొంతమంది సిబ్బందితో.. ఆ అధికారికి వాగ్వాదం జరిగి... అది పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఈ విషయం సద్దుమణిగింది. కాగా సిబ్బంది పది నిమిషాలు ఆలస్యమైనా హాజరుపట్టికలో ఆప్‌సెంట్ వేయడం వివాదానికి కారణమైంది. ఇటీవల ఓ సీనియర్ అకౌంటెంట్ డ్యూటీకి వెళ్లి.. పలు బిల్లులు పాస్ చేసినా.. ఏకంగా 14 రోజులు ఆప్‌సెంట్ నమోదు చేసేశారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి.. బయటపడని వివాదంగా మారింది.
తాజాగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ఇటీవల కొంతమంది ట్రెజరీ ఉద్యోగులు కలిశారు. జిల్లా ఖజానాశాఖలో ఓ అధికారిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. అలాగే యూట్యూబ్ చానెల్‌లో ఆయన పోస్టు చేసిన రీల్స్‌కు లైక్‌లు, అనుకూలంగా కామెంట్‌లు పెట్టాలని కోరుతున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌చేశారు. జిల్లా ట్రెజరీ సిబ్బంది ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేయాలని కోరారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సమస్యను వివరిస్తాననని చెప్పారు.
మరికొన్ని ఆరోపణలు...
జిల్లా ట్రెజరీలోని ఓ అధికారి లాగిన్‌లో నెలల తరబడి ఎరియర్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే ఆరోపణలున్నాయి. సిబ్బంది ప్రమోషన్, బదిలీ, రెగ్యులరైజేషన్, ప్రొబేషనరీ విషయంలో కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఉద్యోగి కారుణ్య నియామకం కింద చేరాడు. ఆ ఉద్యోగి డిగ్రీ సర్టిఫికెట్ జెన్యూనిటీ నిర్ధారణ విషయంలో ఏకంగా తండ్రి పేరును మార్పుచేసి యూనివర్శిటీకి పంపించడం.. పోలీసులు విచారణ చేసి... తండ్రి పేరు సర్టిఫికెట్‌లో ఉన్నపేరు ఒకటి కాదని అభ్యంతరం తెలపడం.. దీని వెనుక ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారని ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆ ఉద్యోగి.. ఉన్నతాధికారిపై శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడో పొరపాటు జరిగిందని సరిచేసి.. ఆ ఉద్యోగి సర్టిఫికెట్ నిర్ధారణ సమస్యను పరిష్కరించి సద్దుమణిగించారు. ఇప్పటికే ఏసీబీతోపాటు ఇతర ఉన్నత అధికారులకు జిల్లా ట్రెజరీపై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే.. త్వరలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
కలెక్టర్ ఆరా...
జిల్లా ఖజానాశాఖలో వివాదాలు.. ఆరోపణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీసినట్లు సమాచారం. ఖజానాశాఖపై అంతర్గత విచారణ జరపుతున్నట్లు తెలిసింది. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకంగా సేవలందించాల్సిందిపోయి.. ఇలా ఆరోపణలకు తావిచ్చుకునేలా చేసుకోవడం ఏవగింపుగా మారింది.
కీలక అధికారికి డైరెక్టర్ నుంచి మెమో..
జిల్లా ఖజానాశాఖ కీలక అధికారికి.. అలాగే ఇటీవల అంతర్యుద్ధంలో పాత్రదారులందరికీ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ నుంచి మెమోలు జారీ అయ్యాయి. శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఖజానా శాఖలో జరుగుతున్న వ్యవహారం.. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని జిల్లా కీలక అధికారికి, అలాగే కిందిస్థాయి సిబ్బంది.. నేరుగా సీట్ల విషయంలో జిల్లా అధికారిని ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందో.. సుమారు 15 మంది సిబ్బంది కూడా వివరణ ఇవ్వాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో ఖజానా శాఖ ప్రక్షాళన జరగడం లేదా.. మూకుమ్మడిగా చర్యలు ఉండే అవకాశముందని ఆ శాఖలో చర్చ నడుస్తోంది.