Share News

విజిటింగ్‌ వీసాపై వెళ్లి..

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:44 AM

40 youths from Uddanam stranded in Malaysia విదేశీ ఉద్యోగాలపై ఆశపడి.. బ్రోకర్లను నమ్మి.. విజిటింగ్‌ వీసాపై మలేషియా వెళ్లిన.. ఉద్దానం ప్రాంతానికి చెందిన 40 మంది యువకులు అక్కడ చిక్కుకున్నారు. ఇమిగ్రేషన్‌ అధికారులు విజిటింగ్‌ వీసాలు స్వాధీనం చేసుకోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.

విజిటింగ్‌ వీసాపై వెళ్లి..
ఎమ్మెల్యే శిరీషకు సమస్య వివరిస్తున్న బాధితుల కుటుంబ సభ్యులు

  • మలేషియాలో చిక్కుకున్న 40మంది ఉద్దానం యువకులు

  • నలుగురిని అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్‌ అధికారులు

  • తమ పిల్లలను రప్పించాలని ఎమ్మెల్యే శిరీషకు విన్నవించిన తల్లిదండ్రులు

  • పలాస/ వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): విదేశీ ఉద్యోగాలపై ఆశపడి.. బ్రోకర్లను నమ్మి.. విజిటింగ్‌ వీసాపై మలేషియా వెళ్లిన.. ఉద్దానం ప్రాంతానికి చెందిన 40 మంది యువకులు అక్కడ చిక్కుకున్నారు. ఇమిగ్రేషన్‌ అధికారులు విజిటింగ్‌ వీసాలు స్వాధీనం చేసుకోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. ఈ విషయం తెలిసి.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మలేషియా నుంచి తమ పిల్లలను క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే..

  • మలేషియాలో ఉద్యోగం.. పైగా ప్రతినెలా రూ.60వేలు వేతనం ఇస్తారని బ్రోకర్లు ఆశ కల్పించారు. ప్రస్తుతం విజిటింగ్‌ వీసా ఇస్తామని, పనిలో చేరిన తర్వాత వర్కింగ్‌ వీసా ఇస్తామని చెప్పారు. దీంతో వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన మొత్తం 40 మంది నిరుద్యోగులు రూ.1.75 లక్షలు చొప్పున బ్రోకర్లకు చెల్లించారు. ఆగస్టు 12న మలేషియా దేశానికి విజిటింగ్‌ వీసాపై వెళ్లారు. తీరా అక్కడ బ్రోకర్లు వీరిని పనికి కుదిర్చినా పర్మినెంట్‌ వీసా లేకపోవడంతో సంబంధిత కంపెనీల్లో కొంతమందిని మలేషియా ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గురువారం గడూరు, ఒంకులూరు, యర్రముక్కాం గ్రామాలకు చెందిన చొక్కర సాయి, లండ తరుణ్‌కుమార్‌, చీకటి సాయివంశీ, గిరిబాబును ప్రశ్నించి.. వారివద్ద విజిటింగ్‌ వీసాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో గిరిబాబు అతికష్టంపై బయటపడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వర్కింగ్‌ వీసా లేక అక్కడ పడరాని పాట్లు పడుతున్నట్టు తెలిపారు. దీంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన బాధితుల తల్లిదండ్రులు శుక్రవారం పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష వద్ద తమ సమస్యను ఏకరవు పెట్టారు. తాము బ్రోకర్లకు ఎంత డబ్బులు చెల్లించింది, అక్కడ తమ కుమారులు పడుతున్న ఆవేదనను విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే తక్షణం స్పందిస్తు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు సమాచారం చేరవేశారు. మలేషియా నుంచి వారిని రప్పించేలా ఏర్పాట్లు చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 12 , 2026 | 12:44 AM