Share News

ట్రాన్స్‌పాండర్లు అమర్చట్లే!

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:04 AM

Transponders not installed on boats సముద్రంలో మత్స్యకా రులు ఎక్కడ ఉన్నారు.? ఏ చోట వేటాడుతున్నారు?.. ఏమైనా ప్రమాదంలో ఉన్నారా? వంటివి తెలుసుకోవడంతో పాటు వారికి అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ట్రాన్స్‌పాండర్‌ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల విశాఖలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన పడవలకు ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేయాలని, దీనిపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ, జిల్లాలో మాత్రం చాలామంది మత్స్యకారులు తమ పడవలకు ట్రాన్స్‌పాండర్లను అమర్చడం లేదు.

ట్రాన్స్‌పాండర్లు అమర్చట్లే!

  • ఉచితంగా పరికరాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం

  • అయినా పడవలకు అమర్చని మత్స్యకారులు

  • అత్యవసర సమయాల్లో తప్పని ఇబ్బందులు

  • మెరైన్‌ పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత

  • రణస్థలం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి):

  • సిక్కోలులో తీర ప్రాంత విస్తీర్ణం 193 కిలోమీటర్లు

  • తీర ప్రాంత నియోజకవర్గాలు 6

  • మత్స్యకార గ్రామాలు 164

  • వేటపై ఆధారపడిన మత్స్యకారులు 60 వేలు

  • వలస బతుకు సాగిస్తున్నవారు 32 వేలు

  • ఏటా మత్స్యసంపద లావాదేవీలు రూ.800 కోట్లు

  • జిల్లాలో మర బోట్లు 1600

  • ఐబీఎం పడవలు 322

  • - 2018 నవంబరు 30న ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం మత్స్యకారులు పాకిస్తాన్‌ కోస్టుగార్డులకు చిక్కారు. గుజరాత్‌ నుంచి అరేబియా మహా సముద్రంలో చేపలవేటకు బయలుదేరిన వీరు పాకిస్తాన్‌ సరిహద్దు జలాల్లో ప్రవశించారు. దీంతో అక్కడి కోస్టుగార్డులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పాకిస్తాన్‌ జైల్లో 13 నెలల పాటు మగ్గిపోయారు. అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చొరవతో 13 నెలల తరువాత 2020 జనవరి 6న వారు విడుదలయ్యారు.

  • ఇటీవల విశాఖ నుంచి చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు అలల తాకిడికి పడవ బోల్తా పడడంతో గల్లంతయ్యారు. ఆరుగురు వరకూ వేటకు వెళ్లగా ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. ఓ మత్స్యకారుడు కిలోమీటర్ల మేర ఈదుకొని తీరానికి చేరుకున్నాడు.

  • సముద్రంలో మత్స్యకా రులు ఎక్కడ ఉన్నారు.? ఏ చోట వేటాడుతున్నారు?.. ఏమైనా ప్రమాదంలో ఉన్నారా? వంటివి తెలుసుకోవడంతో పాటు వారికి అత్యవసర సమయంలో సాయం అందించేందుకు ట్రాన్స్‌పాండర్‌ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవల విశాఖలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన పడవలకు ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేయాలని, దీనిపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ, జిల్లాలో మాత్రం చాలామంది మత్స్యకారులు తమ పడవలకు ట్రాన్స్‌పాండర్లను అమర్చడం లేదు. వేటకు వెళ్లినప్పుడు వాటిని అప్‌లోడ్‌ చేయడం లేదు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో వారిని గుర్తించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  • కొరవడిన అవగాహన..

  • ఒక్కో ట్రాన్స్‌ఫాండర్‌కు రూ.36,400 ఖర్చవుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 60:40 ప్రాతిపదికన ఉచితంగా అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లక్ష ట్రాన్స్‌పాండర్లు మంజూరయ్యాయి. అందులో రాష్ట్రానికి 8,305 కేటాయించారు. కానీ, ఇప్పటివరకూ 7,815 అమర్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది జిల్లాలో 322 ట్రాన్స్‌పాండర్లు అమర్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా పూర్తిస్థాయిలో అమర్చినట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం అందించే ట్రాన్స్‌పాండర్లు. లైఫ్‌ జాకెట్ల వినియోగం విషయంలో మత్స్యకారుల్లో అవగాహన కొరవడుతోంది.

  • పరిధి ఎక్కువ.. సిబ్బంది తక్కువ

  • జిల్లాలో కళింగపట్నం, భావనపాడు, బారువలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సముద్ర తీరంలో 12 నాటికల్‌ మైళ్ల దూరం వరకూ నిరంతర భద్రతా చర్యలు పర్యవేక్షించాలి. విదేశీ మత్స్యకారులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలి. నావీ విభాగానికి సమాచారం అందించాలి. కానీ సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తు అయితే.. విధి నిర్వహణకు అవసరమైన మరబోట్లు, అత్యాధునిక పరికరాలు లేకుండా పోయాయి. దీంతో సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతం. గతంలో సమకూర్చిన మరబోట్లు, పరికరాలు తితలీ తుఫాన్‌ సమయంలో పాడయ్యాయి. కానీ వాటి స్థానంలో కొత్తవాటిని సమకూర్చలేదు.

  • బారువ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, మందస మండలాలు ఉన్నాయి. 36 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు, మరో ఐదు శివారు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 42 మంది కానిస్టేబుళ్లకుగాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో శివారు మండలాల్లో విధుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి మందస మండలం గంగువాడ వరకూ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. భావనపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో 63 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు, మరో ఏడు శివారు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 82 మంది సిబ్బంది ఉండాలి. కానీ, కేవలం 29 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు, అరకొర వసతులతో తీర ప్రాంత రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. కళింగపట్నం పరిధిలో గార, శ్రీకాకుళం రూరల్‌, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 43 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 48 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

  • ఇవి చేస్తే మంచిది..

  • మత్స్యకారులకు లైఫ్‌ జాకెట్లు ఇవ్వాలి. వాటికి తేలియాడే గుణం ఉంటుంది. ఒక వేళ ప్రమాదానికి గురైనా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.

  • పడవ ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేలా మత్స్యకారులకు శిక్షణ ఇస్తే బాగుంటుంది.

  • జిల్లాలో 11 తీర మండలాల్లో..మండలానికి ఒకటి చొప్పున మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. సిబ్బందిని నియమించి ప్రతి మత్స్యకార గ్రామానికి సిబ్బందిని దత్తతకు ఇవ్వాలి.

  • విపత్తులు, ప్రమాద హెచ్చరికలపై సరైన సమాచార వ్యవస్థను ఏర్పాటుచేయాలి. మత్స్యకారులకు సమాచారం ఇచ్చేందుకుగాను వాకీటాకీలు అందించాలి. అనుసంధానంగా ఒక నెట్‌వర్క్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచిది.

  • భద్రతకు పెద్దపీట

  • మత్స్యకారుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా అందిస్తున్నాయి. వీటిని తప్పకుండా ప్రతి పడవకు ఏర్పాటు చేసుకోవాలి. లైఫ్‌ జాకెట్లు వేసుకోవాలి. మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో ట్రాన్స్‌పాం డర్లను ఆన్‌లో ఉంచాలి. దీనివలన సముద్రంలో మత్స్యకారులకు ఎటుంటి ప్రమాదం జరిగినా సమాచారం అందుబాటులో ఉంటుంది. మెరైన్‌ పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. అయినా సరే ఉన్న సిబ్బందితో తీర ప్రాంత భద్రత, రక్షణకు శాయశక్తులా కృషిచేస్తున్నాం.

    -జి.హరికృష్ణారావు, మెరైన్‌ ఎస్‌ఐ, కళింగపట్నం

Updated Date - Oct 09 , 2026 | 12:04 AM