Share News

పారదర్శకంగా ఓటర్ల జాబితా

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:05 AM

Voter list revision process ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను అత్యంత ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

జిల్లాలో 1,72,509 మంది ఏఎస్‌డీడీ ఓటర్లు

సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌/ క్రైం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను అత్యంత ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాలో గైర్హాజరు, శాశ్వత బదిలీ, మరణించినవారు, రెండుచోట్ల నమోదైన(ఏఎస్‌డీడీ) ఓటర్లు మొత్తం 1,72,509 మంది ఉన్నట్టు గుర్తించాం. నోటీసుల దశలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం పరిష్కరించాలి. అస్పష్టమైన ఓటర్లు తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించాలి. రికార్డులను సక్రమంగా నమోదు చేస్తూ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారాన్ని డిసెంబరు 15 నాటికి పూర్తిచేయాలి. బూత్‌స్థాయి ఏజెంట్లు తమ పరిధిలోని జాబితాలను పరిశీలించి, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, వాటి సేకరణలో అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. ఏఎస్‌డీడీ ఓటర్ల జాబితాపై వాస్తవాధారిత సూచనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం సమర్పించి, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొనాల’ని సూచించారు. సవరించిన షెడ్యూల్‌ను పార్టీల ప్రతినిధులకు లిఖితపూర్వకంగా అందజేసి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.

పోలింగ్‌ రోజుల్లో స్థానిక సెలవు

పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో.. పోలింగ్‌ రోజుల్లో స్థానిక సెలవును ప్రకటిస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 26, 29, డిసెంబరు 2న మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, విద్యాసంస్థలకు పోలింగ్‌ రోజుతోపాటు.. పోలింగ్‌ ముందురోజు కూడా సెలవు దినంగా కలెక్టర్‌ ప్రకటించారు. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు ఈ రెండు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు డీఈవో రవిబాబు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు : ఎస్పీ మహేశ్వరరెడ్డి

‘శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంఘంతో పాటు కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో ఈ నెల 26న జరగనున్న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చింద’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ‘సభలు, ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు. స్థానికేతరులు వెంటనే ఎన్నికల జరిగే ప్రాంతాలను విడిచి వెళ్లాలి. జిల్లాలో పోలీసు యాక్ట్‌ 30 బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉంటాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద 100/200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, స్టైకింగ్‌ ఫోర్స్‌, క్యూఆర్టీ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను మోహరిస్తాయి. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అక్రమ నగదు, మద్యం రవాణాపై నిఘా పెంచాం. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించే వరకు సీసీ కెమెరాలు, ప్రత్యేక బలగాలతో నిరంతర గస్తీ ఉంటుంది. ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరించినా కఠిన చర్యలు తప్పవ’ని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘనలు, అక్రమాలపై కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 63099 90933, ఎలక్షన్‌ సెల్‌ కంట్రోల్‌ రూమ్‌ 63099 90923, శ్రీకాకుళం డీఎస్పీ 63099 90804, కాశీబుగ్గ డీఎస్పీ 63099 90805 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 25 , 2026 | 12:05 AM