పారదర్శకంగా పాసు పుస్తకాల పంపిణీ
ABN , Publish Date - May 01 , 2026 | 01:03 AM
రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
జలుమూరు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 9న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కురాడలో గురువారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సభా ప్రాంగణం వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పార్కింగ్ జోన్లను నిర్ధారించినట్టు తెలిపారు. ఈ పరిశీలనలో శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.