Share News

పుట్టినరోజు నాడే విషాదం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:15 AM

Youngman dies in road accident ఆ యువకుడు ఐటీఐ చదువుతున్నాడు. పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా జరుపుకోవాలనుకున్నాడు. తన అన్నయ్యను రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి.. తిరిగి ద్విచక్ర వాహనంపై బీచ్‌కు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడ్ని మృత్యువు బలిగొంది. పుట్టినరోజు నాడే ఆ ఇంట విషాదం నెలకొంది.

పుట్టినరోజు నాడే విషాదం
రాజశేఖర్‌(ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బి.కంచరాంలో శోకసంద్రం

పొందూరు/ గార, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆ యువకుడు ఐటీఐ చదువుతున్నాడు. పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా జరుపుకోవాలనుకున్నాడు. తన అన్నయ్యను రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి.. తిరిగి ద్విచక్ర వాహనంపై బీచ్‌కు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడ్ని మృత్యువు బలిగొంది. పుట్టినరోజు నాడే ఆ ఇంట విషాదం నెలకొంది. పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన మీసాల రాజశేఖర్‌(21).. ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మీసాల రమణ, మాణిక్యం దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సాయిరాజ్‌.. మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవానుగా పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు రాజశేఖర్‌(21) ఎచ్చెర్లలో ఐటీఐ చదువుతున్నాడు. ఆదివారం రాజశేఖర్‌ పుట్టినరోజు. స్నేహితులకు కళింగపట్నం బీచ్‌లో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాగా అన్నయ్య సాయిరాజ్‌ ఇటీవల సెలవులపై ఇంటికొచ్చాడు. తిరిగి విధుల్లో చేరేందుకుగానూ.. సాయిరాజ్‌ను ద్విచక్రవాహనంపై ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడు. తిరిగి స్నేహితురాలితో కలిసి కళింగపట్నం వెళ్తుండగా.. గార మండలం ఉప్పరపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోగా రాజశేఖర్‌ తలకు బలమైన గాయం తగిలాయి. వెనుక కూర్చొన్న స్నేహితురాలి కుడిచేతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజశేఖర్‌ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. మరోవైపు రైలులో ప్రయాణిస్తున్న అన్నయ్యకు.. ఈ విషయం తెలియడంతో గుండెలవిసేలా రోదించాడు. గ్రామస్థులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. రాజశేఖర్‌ తండ్రి రమణ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

Updated Date - Oct 12 , 2026 | 12:15 AM