తీరంలో విషాదం
ABN , Publish Date - May 21 , 2026 | 12:24 AM
Two students missing at sea శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవానిపేట సముద్ర తీరంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి పాసైన ఆనందంతో సరాదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన వజ్రపు సాయితిలక్ (15), గుజ్జల లీలాకృష్ణ(15) గల్లంతయ్యారు.
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పదో తరగతి పాసైన ఆనందంలో సముద్ర స్నానానికి వెళ్లి.. ఊహించని ప్రమాదం
ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో మిత్రుడు
ముమ్మరంగా ఎన్డీఆర్‌ఎఫ్, మెరైన్ పోలీసుల గాలింపు
పెదగనగళ్లవానిపేట వద్ద ఘటన
శ్రీకాకుళం రూరల్, మే 20(ఆంధ్రజ్యోతి):
ఆ ముగ్గురూ ప్రాణస్నేహితులు. ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్నారు. కొన్నాళ్ల కిందట ఫలితాలు విడుదల కాగా.. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత కావడంతో ఎంతో సంబరపడ్డారు. ప్రస్తుత వేసవి సెలవులను ఆస్వాదిస్తూ.. సరదాగా సముద్ర స్నానం చేసేందుకు తీరానికి వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా.. కెరటాల ఉధృతికి ఇద్దరు గల్లంతయ్యారు. మరొకరు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరారు. గల్లంతైన విషయం వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, మెరైన్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. తమ బిడ్డలను రక్షించాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
......................
శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవానిపేట సముద్ర తీరంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పదోతరగతి పాసైన ఆనందంతో సరాదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన వజ్రపు సాయితిలక్ (15), గుజ్జల లీలాకృష్ణ(15) గల్లంతయ్యారు. వీరితోపాటు వెళ్లిన మరో స్నేహితుడు దండివీధికి చెందిన తుమ్మి మణికంఠ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ముగ్గురూ ప్రాణస్నేహితులు. వీరు శ్రీకాకుళంలోని టీపీఎంహెచ్ స్కూల్‌లో పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సాయితిలక్, లీలాకృష్ణ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం సెలవులు కావడంతో బుధవారం ఉదయం ఈ ముగ్గురూ కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవానిపేట సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ నాగావళి నది దిశ మార్చుకుని సముద్రంలో కలిసే ప్రాంతంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండి, లోతుగా మారింది. ఆ విషయం తెలియక ముగ్గురూ అక్కడ స్నానానికి దిగారు. ఈదుతూ, ఆడుకుంటూ ఊహించని విధంగా లోతులోకి వెళ్లిపోయారు. కెరటాల ఉధృతికి సాయితిలక్, లీలాకృష్ణ నీట మునిగి గల్లంతయ్యారు. మణికంఠ ప్రాణాపాయం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో, వెంటనే మణికంఠ తన బైక్‌పై శ్రీకాకుళం చేరుకుని గల్లంతైన తన స్నేహితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
ముమ్మరంగా గాలింపు చర్యలు...
విద్యార్థుల గల్లంతు విషయమై కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విపత్తు నిర్వహణ సిబ్బంది, రూరల్ పోలీసులు, మెరైన్ పోలీసులతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. రూరల్ ఎస్‌ఐ కె.రాము, తహసీల్దార్ గణపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సాయితిలక్, లీలాకృష్ణ ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి.
కుటుంబ నేపథ్యాలు..
సాయితిలక్ తండ్రి తేజేశ్వరరావు పక్షవాతంతో ఇంటి వద్దే పరిమితం కాగా.. తల్లి లక్ష్మీదేవి పాతబస్టాండ్ జంక్షన్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె కల్పనకు వివాహం కాగా, రెండో కుమార్తె కోకిల పాలిటెక్నిక్ చదువుతోంది. సాయితిలక్ అందరికంటే చిన్నవాడు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు సముద్రంలో గల్లంతు కావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
లీలాకృష్ణ తండ్రి అప్పారావు ఆటోడ్రైవర్. తల్లి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఈశ్వర వరప్రసాద్ డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతుండగా, చిన్నవాడు లీలాకృష్ణ. రెక్కాడితేకానీ డొక్కాడని ఆ పేద కుటుంబంలో ఇప్పుడు అంతులేని విషాదం అలుముకుంది.
ప్రాణాలతో బయటపడిన మణికంఠ తల్లిదండ్రులు (తండ్రి కామేశ్వరరావు) విజయనగరం జిల్లాలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. మణికంఠ శ్రీకాకుళంలోని తన మేనత్త వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.