Share News

బాలల దినోత్సవంనాడే విషాదం

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:30 AM

Boy dies after falling into a pond బహిర్భూమి కోసం వెళ్లిన ఆ బాలుడు.. ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతిచెందాడు. బాలల దినోత్సవం నాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నెలకొంది.

బాలల దినోత్సవంనాడే  విషాదం
భాస్కరరావు మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు .. ఇన్‌సెట్‌లో భాస్కరరావు(ఫైల్‌)

ప్రమాదవశాత్తు చెరువులోపడి బాలుడు మృతి

పాతపట్నం/ రూరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బహిర్భూమి కోసం వెళ్లిన ఆ బాలుడు.. ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతిచెందాడు. బాలల దినోత్సవం నాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నెలకొంది. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతపట్నం మండలం కోడూరు పంచాయతీ ఎగువ ప్రహరాజపాలెం గ్రామానికి చెందిన బంటుపల్లి భాస్కరరావు(13).. అనే బాలుడు శనివారం చెరువులో పడి మృతిచెందాడు. భాస్కరరావు పాతపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు పెట్టాడు. ఉదయం 11 గంటల సమయంలో సమీపంలో చెరువు వద్దకు బహిర్భూమి కోసం వెళ్లాడు. ఎంతసేపయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కృష్ణ, చిన్నమ్మ ఆందోళన చెందారు. తల్లిదండ్రులతోపాటు మేనమామ తేజేశ్వరరావు కూడా భాస్కరరావు కోసం వెతికారు. చెరువు వద్ద భాస్కరరావు నిక్కరు కనిపించింది. దీంతో చెరువులో గాలించగా.. భాస్కరరావు విగతజీవిగా కనిపించడంతో లబోదిబోమని రోదించారు. వెంటనే పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి.. మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. బాలల దినోత్సవం రోజే తమ కుమారుడు దూరమయ్యాడంటూ బోరున విలపించారు.

సీఐ కె.వెంకటరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరాతీశారు. భాస్కరరావు బహిర్భూమి కోసం చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి మృతి చెందినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి తెలిపారు.

Updated Date - Nov 15 , 2026 | 12:30 AM