Share News

ఈత మాటున విషాదం

ABN , Publish Date - May 23 , 2026 | 12:23 AM

Increasing dangers in coastal areas ఈత సరదా పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో యువత, విద్యార్థులు ఆనందంగా గడిపేందుకు బీచ్‌లకు వెళుతున్నారు. కానీ ఆ ఆనందం మాటున కొన్నిసార్లు అలల ఉధృతి రూపంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈత మాటున విషాదం
పెద్దగనగళ్లవానిపేట తీరం వద్ద హెచ్చరిక బోర్డు

  • తీరప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదాలు

  • విద్యార్థులు, యువత మృత్యువాత

  • జాగ్రత్తగా ఉండాలంటున్న మెరైన్‌ పోలీసులు

  • ఇచ్ఛాపురం, మే 22(ఆంధ్రజ్యోతి):

  • గత ఏడాది ఆగస్టు 6న భావనపాడు తీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దున్న దుర్యోధన, తిమ్మల జశ్వంత్‌, రాయల రాజేష్‌ సరదాగా భావనపాడు తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానానికిదిగారు. రాకాసి అలలకు చిక్కుకుని ముగ్గురూ గల్లంతయ్యారు. ఆ మరుసటి రోజు మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.

  • గత ఏడాది అక్టోబరు 19న పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన జగదీష్‌ అనే యువకుడు గార మండలం మొగదాలపాడు బీచ్‌లో గల్లంతయ్యాడు. పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు నలుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సముద్ర స్నానం చేస్తున్న సమయంలో జగదీష్‌ గల్లంతయ్యాడు. తరువాత రోజు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

  • ఈ నెల 20న శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట వద్ద ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన వజ్రపు సాయితిలక్‌(15), గుజ్జల లీలాకృష్ణ(15)తోపాటు మరొక స్నేహితుడు సముద్ర స్నానానికి దిగారు. రాకాసి అల ఉధృతికి సాయితిలక్‌, లీలాకృష్ణ కొట్టుకుపోయారు. గురువారం వారి మృతదేహాలు కుందువానిపేట తీరానికి చేరాయి. ఇంటికి క్షేమంగా తిరిగొస్తారని ఎదురుచూసిన తల్లిదండ్రులు.. వారిని విగతజీవులుగా చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

  • ..ఇలా ఈత సరదా పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో యువత, విద్యార్థులు ఆనందంగా గడిపేందుకు బీచ్‌లకు వెళుతున్నారు. కానీ ఆ ఆనందం మాటున కొన్నిసార్లు అలల ఉధృతి రూపంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సముద్ర సాన్నాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మెరైన్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • జిల్లాలో 11 మండలాల్లో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 18 చోట్ల సముద్రస్నానాలు చేసేందుకు అనుకూలం. కానీ ఎక్కడపడితే అక్కడ యువత సముద్రస్నానాలకు దిగి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కళింగపట్నం, భావనపాడు, అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌, బారువ బీచ్‌, డొంకూరు తీరానికి ఎక్కువగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఏటా సముద్ర స్నానాలు సరదా మాటున్న కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుర్తింపు, ఆపై మెరైన్‌ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్రస్నానాలకు దిగితే మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మెరైన్‌ పోలీసులు సూచిస్తున్నారు.

  • అరకొరగా సిబ్బంది..

  • ఇచ్ఛాపురం మండలం నుంచి రణస్థలం మండలం వరకూ తీరప్రాంత పరిరక్షణ మెరైన్‌ పోలీసుల బాధ్యత. కానీ జిల్లాలో కేవలం భావనపాడు, కళింగపట్నం, బారువలో మాత్రమే మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒక్కో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలతోపాటు ఇతర సిబ్బంది 40 మంది వరకూ ఉండాలి. కానీ ఏ స్టేషన్‌లోనూ పది మంది సిబ్బంది కూడా లేరు. తీరంలో గస్తీ కోసం ఎటువంటి పరికరాలు, యంత్రాలు లేవు. వాస్తవానికి తీరంలోని మూడు కిలోమీటర్ల వరకూ మెరైన్‌ పోలీసులే గస్తీ కాయాలి. కానీ వారు తీరానికే పరిమితమైపోతున్నారు. ఆధునిక బైనాక్యులర్లు లేవు. తీరంలో వెళ్లేందుకు, పర్యవేక్షించేందుకు బోట్లు సైతం లేవు. అందుకే ఈ ఏడాది మెరైన్‌ పోలీస్‌ యంత్రాంగం ముందే మేల్కోంది. తీర ప్రాంతాల్లో మెరైన్‌ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్ర స్నానాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  • అప్రమత్తంగా ఉండాలి

  • మెరైన్‌ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్రస్నానాలు చేయాలి. ఈ విషయంలో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలే మూల్యంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. పిల్లల కదలికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి.

    - పారినాయుడు, ఎస్‌ఐ, మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌, బారువ

Updated Date - May 23 , 2026 | 12:23 AM