తీరంలో విషాదం
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:28 AM
Two engineering students die at Bhavanapadu Beach వారంతా ఇంజనీరింగ్ చదివే స్నేహితులు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. అంతాకలిసి స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరొక విద్యార్థిని మెరైన్ పోలీసులు కాపాడారు. ఈ ఘటన భావనపాడు బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
భావనపాడు బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
మరొకరిని కాపాడిన మెరైన్ పోలీసులు
మృతులు.. విశాఖ, విజయనగరం జిల్లావాసులు
సంతబొమ్మాళి, జూన్28(ఆంధ్రజ్యోతి): వారంతా ఇంజనీరింగ్ చదివే స్నేహితులు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. అంతాకలిసి స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరొక విద్యార్థిని మెరైన్ పోలీసులు కాపాడారు. ఈ ఘటన భావనపాడు బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నౌపడ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న గోలివంకల అగస్తీయ(19), సారపెంట యశ్వంత్ (19)తో పాటు జర్జాన అభిలాష్, రేగాల హేమంత్, తాడి నరేంద్ర, పట్నాన గోవింద్, మామిడి రాకేష్ ఆదివారం సెలవు కావడంతో భావనపాడు బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో కాసేపు సరదాగా గడిపి భోజనం చేశారు. అనంతరం సముద్రంలోకి స్నానాలకు దిగారు. లోతు అంచనా లేకపోవడంతో పాటు అలల ఉఽధృతి ఎక్కువగా ఉండడంతో అగస్తీయ, యశ్వంత్, అభిలాష్ సముద్రంలోకి కొట్టుకుపోయారు. వెంటనే మెరైన్ పోలీసులు, మత్స్యకారులు వారి కోసం గాలించారు. అభిలాష్‌ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అగస్తీయ, యశ్వంత్ లోపలికి కొట్టుకుపోయి రెండు గంటల తరువాత విగతజీవులుగా ఒడ్డుకు చేరారు.
విశాఖ జిల్లా కసింకోటకు చెందిన అగస్తీయ బీటెక్ (ఐటీ) ప్రఽథమ సంవత్సరం, విజయనగరం జిల్లా మొరకముడిదాంకు చెందిన యశ్వంత్ బీటెక్ (సీఎస్‌సీ) ఫస్టియర్ చదువుతున్నారు. అంతవరకు కలసి మెలసి ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన స్నేహితులు తమ కళ్ల ముందే సముద్రంలో కొట్టుకుపోయి మృతదేహాలుగా తేలడంతో తోటి విద్యార్థులు విలపించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు.
తరచూ ప్రమాదాలు
భావనపాడు తీరంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బీచ్‌కు వెళ్తే ఎంతో ఉల్లాసం లభిస్తుంది. అయితే, జాగ్రత్తగా లేకపోతే మాత్రం విషాదం తప్పదు. బీచ్‌లో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు అధికారులు అప్రమత్తం చేస్తున్నా కొందరు సందర్శకులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
మంత్రి అచ్చెన్న దిగ్ర్భాంతి
భావనపాడు బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందడంపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకుండా భావనపాడు బీచ్ వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని సూచించారు. మెరైన్ పోలీసులు, సంబంధిత అధికారులు.. అప్రమత్తంగా ఉండి బీచ్‌కు వచ్చే పర్యాటకులకు తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు.