Share News

‘తీర’మంత విషాదం!

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:00 AM

Increasing Dangers in Coastal Areas జిల్లాలోని తీర ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. యువత, విద్యార్థులు ఆనందంగా గడిపేందుకు బీచ్‌లకు వెళుతున్నారు. సముద్ర స్నానాలకు దిగి.. సరదా మాటున ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది అలల ఉధృతికి కొట్టుకుపోయి.. ప్రాణాలు కోల్పోతున్నారు.

‘తీర’మంత విషాదం!

  • జిల్లాలో తీర ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదాలు

  • విద్యార్థులు, యువత మృత్యువాత

  • జాగ్రత్తగా ఉండాలంటున్న మెరైన్‌ పోలీసులు

  • ఇచ్ఛాపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి)

  • గత ఏడాది అక్టోబరు 19న పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన జగదీష్‌ అనే యువకుడు గార మండలం మొగదాలపాడు బీచ్‌లో గల్లంతయ్యాడు. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు నలుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సముద్ర స్నానం చేస్తున్న సమయంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు.

  • గత ఏడాది ఆగస్టు 6న భావనపాడు తీరంలో దున్న దుర్యోధన, తిమ్మల జశ్వంత్‌, రాయల రాజేష్‌ అనే ముగ్గురు యువకులు అలల ఉధృతితో ప్రాణాలు కోల్పోయారు.

  • ఈ ఏడాది మేలో శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లపేట వద్ద సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వజ్రపు సాయితిలక్‌, గుజ్జల లీలాకృష్ణ.. సముద్ర స్నానానికి దిగగా.. అలల ఉధృతికి కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు.

  • తాజాగా ఈ నెల 21న శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట సముద్రంలో నలుగురు మృతి చెందారు. ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ పొందుతున్న 25 మంది.. దసరా వేళ సరదాగా విహారయాత్రకు వెళ్లారు. పెద్దగనగళ్లవానిపేట తీరంలో సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి మర్రి మహి(18), గొల్లపల్లి పావని (19), కొండల మాధవి (19), బిడ్డిక విక్రమ్‌(25) గల్లంతై.. ప్రాణాలు కోల్పోయారు.

  • జిల్లాలోని తీర ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. యువత, విద్యార్థులు ఆనందంగా గడిపేందుకు బీచ్‌లకు వెళుతున్నారు. సముద్ర స్నానాలకు దిగి.. సరదా మాటున ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది అలల ఉధృతికి కొట్టుకుపోయి.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో.. ఆయా కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోతున్నారు. జిల్లాలో 18 చోట్ల సముద్రస్నానాలు చేసేందుకు అనుకూలం. కానీ ఎక్కడపడితే అక్కడ యువత సముద్ర స్నానాలకు దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. కళింగపట్నం, భావనపాడు, అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌, బారువ బీచ్‌, డొంకూరు తీరానికి ఎక్కువగా పర్యాటకులు తరలివస్తుంటారు. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఏటా ఏదో ప్రమాదంలో కొంతమంది యువత మృత్యువాత పడుతున్నారు. అందుకే గుర్తింపు, ఆపై మెరైన్‌ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్రస్నానాలకు దిగితే మంచిది. తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని మెరైన్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడిపడితే అక్కడ సముద్ర స్నానాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

  • అరకొరగా సిబ్బంది..

  • జిల్లాలో ఇచ్ఛాపురం మండలం నుంచి రణస్థలం మండలం వరకూ 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీరప్రాంత పరిరక్షణ మెరైన్‌ పోలీసుల బాధ్యత. కానీ జిల్లాలో కేవలం భావనపాడు, కళింగపట్నం, బారువలో మాత్రమే మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒక్కో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది 40 మంది వరకూ ఉండాలి. కానీ ఏ స్టేషన్‌లోనూ పది మంది సిబ్బంది కూడా లేరు. తీరంలో గస్తీ కోసం ఎటువంటి పరికరాలు, యంత్రాలు లేవు. ఆధునిక బైనాక్యులర్లు లేవు. తీరంలో వెళ్లేందుకు, పర్యవేక్షించేందుకు బోట్లు సైతం లేవు. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో పర్యవేక్షణ కొరవడుతుందనే విమర్శలు ఉన్నాయి.

  • అప్రమత్తంగా ఉండాలి

  • మెరైన్‌ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్ర స్నానాలు చేయాలి. ఈ విషయంలో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌జట్టి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికలపై దృష్టి సారించాలి.

    - పారినాయుడు, ఎస్‌ఐ, మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌, బారువ

Updated Date - Oct 23 , 2026 | 12:00 AM