Share News

క్రీడాభివృద్ధి దిశగా..

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:03 AM

Steps to reopen academies క్రీడలను మరింత అభివృద్ధి చేసేందుకు క్రీడా అకాడమీల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన అకాడమీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

క్రీడాభివృద్ధి దిశగా..

  • అకాడమీల పునఃప్రారంభానికి అడుగులు

  • రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

  • ప్రతిభ గల క్రీడాకారులకు సదావకాశం

  • శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): క్రీడలను మరింత అభివృద్ధి చేసేందుకు క్రీడా అకాడమీల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన అకాడమీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 15 నుంచి 19 ఏళ్ల మధ్య క్రీడాకారులకు ఇది మంచి అవకాశం. అకాడమీల్లో చేరేందుకు రాష్ట్రస్థాయి పారదర్శక, ప్రతిభా ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా క్రీడా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తామని క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించింది. ఎంపికైన క్రీడాకారులకు కోచింగ్‌, వసతి, భోజనం, ఆధునిక శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది.

  • మూడు కేంద్రాల్లో నిర్వహణ

  • రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో వివిధ క్రీడా విభాగాలతో క్రీడా అకాడమీలు నిర్వహిస్తారు. విశాఖపట్నంలో అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌ 15 మంది చొప్పున బాలురుకి ఉంటుంది. కాకినాడలో వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌లకు 15 మంది చొప్పున బాలికలకు, హాకీ, ఖోఖో క్రీడాంశాలకు సంబంధించి 20 మంది చొప్పున తీసుకోనున్నారు. తిరుపతిలో జూడో, బ్యాడ్మింటన్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌లకు 10 మంది చొప్పున బాల బాలికలను ఎంపిక చేస్తారు. బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లలో 15 మంది చొప్పున బాలురును ఎంపిక చేయనున్నారు.

  • 26 నుంచి ఎంపికలు

  • రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక సంబంధిత కేంద్రాల్లో నిర్వహిస్తారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్‌ కేంద్రంలో ఈ నెల 26న జూడో, బాడ్మింటన్‌ బాలురు, బాలికలను ఎంపిక చేస్తారు. 27న బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ బాలురకు ఎంపికలు నిర్వహిస్తారు. 28న రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్సిస్‌ బాలురు, బాలికలకు ఎంపిక నిర్వహిస్తారు.

  • కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ఈ నెల 29న వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌ బాలికలకు, ఈ నెల 30న హాకీ, ఖోఖో బాలికలకు ఎంపికలు ఉంటాయి.

  • విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలో మే 4న అథ్లెటిక్స్‌ బాలురకు, మే 5న సైక్లింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ బాలురకు ఎంపికలు నిర్వహిస్తారు.

  • క్రీడా ఎంపికలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, చదువుకున్న పాఠశాల, కళాశాల నుంచి సర్టిఫికెట్‌, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా ప్రతిభా సర్టిఫికెట్లు, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, పది పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలి. క్రీడా దుస్తులు, కిట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ధ్రువీకరించిన తర్వాత ఒక జిరాక్స్‌ సెట్‌ను సమర్పించాలి.

  • గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వరం

  • క్రీడా అకాడమీల ద్వారా ఉత్తమ క్రీడాకారులు తయారవుతారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ఈ అకాడమీలు మంచి వరంగా చెప్పుకోవచ్చు. అకాడమీల ద్వారా తర్ఫీదునిస్తే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన పౌష్టికాహారం లేక క్రీడల్లో కొంతమంది వెనుకబడి పోతున్నారు. అకాడమీల ద్వారా మంచి పౌష్టికాహారంతోపాటు అధునాతన సౌకర్యాలతో తర్ఫీదు ఉండడంతో రాష్ర్టానికి పతకాలు ఆశించవచ్చు.

    - ఎ.మహేష్‌బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, శ్రీకాకుళం

Updated Date - Apr 15 , 2026 | 12:03 AM